Telangana: తెలివిగా కొట్టేశారు.. అతి తెలివితో అడ్డంగా బుక్కయ్యారు.. అసలు ఏం జరిగిందంటే?

నర్మల్‌గా బంగారం లేదా డబ్బులు కాజేసే వారిని చూసుంటాం.. కానీ వీళ్ల టార్గెట్ మాత్రం కాస్ట్లీ సిగరెట్లు.. అవును పక్కా ప్లాన్‌తో వేరే రాష్ట్రం నుంచి వచ్చి మరీ సిగరెట్లు కాజేస్తున్నారు ఈ కేటుగాళ్లు. తాజాగా ఆదిలాబాద్‌లోని ఓ షాప్‌లో రూ.5 లక్షల విలువైన సిగరెట్ బాక్సులను మాయం చేశారు. అయితే స్కెచ్ అదిరిపోయినా, సీన్ రివర్స్ అయ్యింది. ఎక్కడైతే చేతివాటం చూపించారో, అక్కడే సొత్తు అమ్ముతూ అడ్డంగా బుక్కయ్యారు.

Telangana: తెలివిగా కొట్టేశారు.. అతి తెలివితో అడ్డంగా బుక్కయ్యారు.. అసలు ఏం జరిగిందంటే?
Adilabad Cigarette Shop Theft

Edited By:

Updated on: Sep 05, 2026 | 7:47 PM

రాత్రి వేళ షాపు మూసేశారు.. తాళాలు వేశారు.. అంతా సేఫ్ అనుకున్నారు. కానీ తెల్లారేసరికి షాపులోని లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులు మాయమయ్యాయి. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు.. నగదుతో పాటు ఏకంగా రూ.5.35 లక్షల విలువైన సిగరెట్లను ఎత్తుకెళ్లారు. అయితే, చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు మళ్లీ అదే ప్రాంతానికి‌ రావడం, మరో షాపులో చోరీకి రెక్కీ నిర్వహించడంతో దొంగల ముఠా గుట్టు రట్టైంది. సిగరెట్ల కోసం రాష్ట్రాలు దాటొచ్చిన అంతర్రాష్ట్ర ముఠా బాగోతం బట్టబయలైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలోని ఓ సిగరెట్ షాప్‌ను నిందితులు టార్గెట్ చేశారు. ముందుగా షాప్ వద్ద రెక్కీ నిర్వహించారు. రాత్రి సమయం చూసుకుని గడ్డపారతో షాప్ తాళాలు పగలగొట్టారు. లోపలికి వెళ్లి వివిధ రకాల సిగరెట్ బాక్సులతో పాటు కౌంటర్‌లో ఉన్న నగదుతో సహా మొత్తం రూ.5.35 లక్షల విలువైన సొత్తు కాజేశారు. ఇక చోరీ చేసిన సిగరెట్ బాక్సులను వెంటనే అమ్మేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్, పటాన్‌చెరులో తమకు పరిచయమైన వ్యక్తిని సంప్రదించారు.

అక్కడ కొంత సొత్తును విక్రయించి.. వచ్చిన డబ్బును అందరూ పంచుకున్నారు. మిగిలిన బాక్సులను కూడా ఎలాగైనా అమ్మేసి మరో షాప్‌ను కొట్టేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరి మళ్లీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ షాప్‌లో సిగరెట్ బాక్సులను విక్రయిస్తుండగా గమనించిన పోలీసులు వివరాలు సేకరించేందుకు దగ్గరకు రాగా.. వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. అంబేద్కర్ చౌక్‌లోని సిగరెట్ షాప్‌లో చోరీ చేసింది తామేనని నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి చోరీకి గురైన సిగరెట్ బాక్సులతో పాటు రూ.60 వేల నగదు, మారుతి వ్యాగన్-ఆర్ కారు, సెల్‌ఫోన్లు, గడ్డపార, హ్యాండిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో అమెరికన్ సిగరెట్లు, కింగ్ సైజ్ గోల్డ్, లైట్ గోల్డ్ ఫ్లేక్, స్మాల్ గోల్డ్ ఫ్లేక్, బ్రిస్టల్, క్లాసిక్ మిల్డ్స్ రెడ్, ఓల్డ్ ఎడిషన్, ఐస్ బరస్ట్, కనెక్ట్, సిల్క్ తదితర బ్రాండ్ల సిగరెట్ బాక్సులు ఉన్నాయని వెల్లడించారు.

ఒక్క కేసు కాదు.. ఏడు కేసుల లింక్!

పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్ గతంలో కూడా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్–హైదరాబాద్ హైవే పక్కన ఉన్న ఓ పాన్ డబ్బాను పగలగొట్టి నగదు చోరీ చేసినట్లు కూడా నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఇప్పటికే ఏడు అంతర్రాష్ట్ర కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని నలుగురు రాజస్థాన్‌లోని పాలి జిల్లా జైతారన్ ప్రాంతానికి చెందినవారు కాగా.. మరో నిందితుడు పటాన్‌చెరుకు చెందిన వ్యక్తిగా తేలింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి రాష్ట్రాలు దాటి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Loading...
Unable to load recommendations.
Follow Us