సినిమాటిక్ స్టైల్లో జరిగిన వైశాలి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు. పరిచయం దగ్గర్నుంచి కిడ్నాప్ వరకు ప్రతీ ఇన్సిడెంట్‌నీ సీన్ టు సీన్ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. వైశాలికి, నవీన్‌రెడ్డికి అసలెలా పరిచయం ఏర్పడింది. కిడ్నాప్‌కి దారితీసిన పరిణామాలన్నింటినీ అందులో పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతికి దక్కింది. అందులోని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
గతేడాది ఓ స్పోర్ట్స్ అకాడమీలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని వైశాలితో కలిసి ఫొటోలు తీసుకున్నాడు నవీన్. ఆ తర్వాత, కొద్దిరోజులకే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటే చేసుకుంటానంటూ వైశాలి బదులివ్వడంతో.. ఆమె పేరెంట్స్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే, వైశాలి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు.
వైశాలి పేరెంట్స్ రిజక్ట్ చేయడంతో నవీన్‌రెడ్డిలో ఉన్మాది నిద్రలేచాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్‌చేసిన నవీన్‌రెడ్డి.. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను అప్‌లోడ్‌చేసి వైరల్ చేశాడు. 5 నెలలక్రితం వైశాలి ఇంటి ముందు షెడ్డు వేసుకుని వేధించడం మొదలుపెట్టాడు. ఆగస్టు 31న ఫ్రెండ్స్‌తో కలిసి వైశాలి ఇంటి ముందు న్యూసెన్స్ చేశాడు నవీన్‌రెడ్డి. అప్పుడు వైశాలి కంప్లైంట్ ఇవ్వడంపై నవీన్‌పై కేసు నమోదైంది. ఇక, ఈనెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకుని గుంపుతో కలిసి ఎటాక్ చేశాడు.
వైశాలినీ కిడ్నాప్ చేశాక బలవంతంగా పెళ్లి చేసుకోవాలన్నదే నవీన్‌రెడ్డి ప్లాన్ అంటూ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు పోలీసులు. అయితే, వైశాలి కిడ్నాప్ గురించి మీడియాలో రావడం, పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న నవీన్‌రెడ్డి వెనక్కి తగ్గాడు. తన ఫ్రెండ్ సాయంతో వైశాలిని కారులో మన్నెగూడకి పంపించాడు. అక్కడ్నుంచి వైశాలి ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్టు సీన్ టు సీన్ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు పోలీసులు.
అయితే, వైశాలినీ కిడ్నాప్ చేసిన తరువాత సినిమా తరహాలో నాటకాలాడాడు. కిడ్నాప్‌లో పాల్గొ్న్న అందరి సెల్ ఫోన్ లను ముందుగానే స్విచ్ ఆఫ్ చేయించాడు నవీన్ రెడ్డి. తన సెల్ ఫోన్‌ని మాత్రం ఆన్‌లో పెట్టాడు నవీన్ రెడ్డి. దాంతో సెల్ ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. అయితే, ఈ కిలాడీ చాలా తెలివిగా తన సెల్ ఫోన్‌ని మరొక వైకిల్‌లో పెట్టి విజయవాడ వైపునకు పంపించాడు. తాను మాత్రం వైశాలిని తీసుకొని నాగార్జునసాగర్ వైపు వెళ్లిపోయాడు. తన వోల్వో కార్లను మాత్రం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనే తిప్పాడు నవీన్ రెడ్డి. ఆ తరువాత సాగర్‌కు కొద్ది దూరంలో వైశాలిని వదిలి వెళ్లిపోయాడు నవీన్ రెడ్డి. అయితే, ప్రస్తుతం నవీన్ రెడ్డి తమిళనాడు, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ రెడ్డితో ఉన్న రుమెన్, సిద్ధూ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నవీన్‌ని పట్టుకునేందుకు 10 స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. కాగా, ఇప్పటికే అరెస్టు చేసిన వారి కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి..