
సాధారణంగా ఒక వాటర్ క్యాన్ ధర రూ.20 నుంచి రూ.50 మధ్య ఉంటుంది. కానీ సిద్ధిపేట జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం ఒక వాటర్ క్యాన్ ఏకంగా రూ.75 వేల ధర పలికింది. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం శంకరయ్యకుంట గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 200 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చొరవతో బాలవికాస్ ఆధ్వర్యంలో కొత్తగా వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలవికాస్ ప్రతినిధులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో వాటర్ ప్లాంట్‌కు ఏవైనా మరమ్మతులు అవసరమైతే వాటి కోసం ఒక మూలనిధి (కార్పస్ ఫండ్) ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదటి వాటర్ క్యాన్‌కు వేలం నిర్వహించారు.
ఈ వేలంలో గ్రామానికి చెందిన ఏర్వ నరసింగరావు, ఏర్వ శ్రీను పోటీపడ్డారు. చివరకు ఏర్వ శ్రీను అత్యధికంగా రూ.75 వేల బిడ్ వేసి మొదటి వాటర్ క్యాన్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో గ్రామస్థులు, కార్యక్రమానికి హాజరైనవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలవికాస్ ప్రతినిధులు మాట్లాడుతూ, వాటర్ ప్లాంట్ అభివృద్ధికి అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఏర్వ శ్రీను పేరు ప్లాంట్‌పై ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శ్రీనుకు తొలి వాటర్ క్యాన్‌ను అందజేశారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. రూ.75 వేల విలువ పలికిన ఈ వాటర్ క్యాన్ ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.