
హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్లో వికారాబాద్ జిల్లాకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు వెరిఫై చేసేందుకు ప్రభుత్వం తరుపున నునావత్ రవి బోరబండ డివిజన్‌కి వచ్చాడు. అయితే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైట్ వన్ నుంచి సైట్ ఫైవ్, అన్నానగర్ తదితర ప్రాంతాల్లో మొత్తం సుమారుగా 800 అప్లికేషన్లు వెరిఫై చేసే బాధ్యతను ప్రభుత్వం నూనవత్ రవికి అప్పజెప్పింది. ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉచితమే. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడే వెరిఫికేషన్ ప్రాసెస్ అధికారులు తమ చేతివాటం చూపిస్తున్నారు. వెరిఫికేషన్ కోసం మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ , మునీర్ మరియు షబానా బేగంలతోపాటు మరో 20 నుంచి 30 మంది దగ్గర డబల్ బెడ్ రూం వెరిఫికేషన్ కోసం 500 నుంచి 5 వేల వరకు వసూలు చేసాడని స్థానికులు తెలిపారు. అదేవిధంగా డబ్బులు ఇవ్వకపోతే డబుల్ బెడ్ రూమ్ క్యాన్సిల్ చేస్తానని చెప్పి వారిని బెదిరించాడని ఫిర్యాదు చేసారు.
ఇప్పటికే 600 అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిందని దరఖాస్తుదారుల నుంచి రవి వసూలు చేసిన మొత్తం సుమారుగా 20 లక్షల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇలా వెరిఫై చేస్తున్న క్రమంలోనే అప్లికేషన్ పెట్టుకున్న ఫయాజ్ అనే వ్యక్తి ఇంటికి చేరుకుని అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు రవి. డబ్బులు ఇవ్వని పక్షంలో అప్లికేషన్ పక్కన పెట్టేస్తామని బ్లాక్‌మెయిల్ చేశాడు. అయితే ఫయాజ్ ఇంట్లో లేకపోవడంతో ఆ కుటంబాన్ని కొంత సమయం కోరాడు. ఈ లోపు స్థానికంగా ఉండే వారి వద్ద 500 నుంచి 5000 వరకు వసూలు చేశాడని స్థానికులు తెలిపారు. ఇటువంటి అధికారుల వల్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న డబల్ బెడ్ రూమ్ పంపిణీ కార్యక్రమానికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక లక్కీ డ్రా ద్వారా చేయటంతో తమకు వస్తాయని ఆశలు సన్నగిల్లాయని అందులో ఇలాంటి ఘటనలు తమను ఇంకా నిరాశకు గురి చేస్తున్నాయని వాపోతున్నారు. అయితే పట్టుబడ్డ వికారాబాద్ రెవెన్యూ అధికారి నునావత్ రవి నిజంగానే రెవెన్యూ ఇన్స్పెక్టరా లేకుంటే మోసగాడా అని మొదట స్థానికులు అనుమానించారు. కానీ అతని వద్ద ప్రభుత్వ ఉత్తర్వులు సంబంధించిన పత్రాలు ఉండటంతో నమ్మేశారు.
అతడు చేసిన మోసాలను గుర్తించిన స్థానికులు చివరికి పోలీసులకు అప్పగించారు. విచారణలో ప్రాథమికంగా 30 నుంచి 40 మంది పేర్లు కంప్లైంట్లో వచ్చాయని వారి వద్ద 60 నుంచి 70 వేల వరకు వసూలు చేశాడని సీఐ తెలిపారు. ఇప్పుడు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. మొత్తం 15 రోజుల వ్యవధిలో 800 అప్లికేషన్స్ వెరిఫై చేయాల్సి ఉండగా 600 అప్లికేషన్స్ వెరిఫికేషన్ పూర్తయిందని వారి వద్ద నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానంటూ.. లక్షల్లో వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే రవిని విచారిస్తే మరిన్ని విషయాలు బయట పడతాయని పోలీసులు చెబుతున్నారు.