
మంచిర్యాల, మే 17: మంచిర్యాల జిల్లాలో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి అత్యవసరంగా బయటకి వస్తున్న వారే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా గొడవలు పెట్టుకుని కత్తులు, రాడ్లతో దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. అర్దరాత్రి రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ.. అత్యవసరంగా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ముందుగా బెదిరించడం, వినక పోతే దాడులకు పాల్పడటం పరిపాటిగా మారుతోంది. తాజాగా గంజాయి మత్తులో ఓ మూక సృష్టించిన విధ్వంసం సంచలనంగా మారింది.
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన చెందిన కొంతమంది యువకులు గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు. మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఓ హోటల్ కు బిర్యానీ తినేందుకు కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన ఆరుగురు యువకులు వచ్చారు. అక్కడే హోటల్ లో యువకులతో గొడవ జరిగింది. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న మందమర్రి యువకులు వీరిపై దాడికి యత్నించారు. భయాందోళనళకు గురైన యువకులు ఆటోలో సోమగూడెంలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. వీరిని వెంబడిస్తూ గంజాయి సేవించిన 8 మందికి పైగా యువకులు ఇంట్లోకి చొరబడి ఇనుప రాడ్లు, గొడ్డలితో ఆ ఆరుగురు యువకులపై తీవ్రంగా దాడి చేశారు. అప్పటికే బాదిత యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల రాకను గమనించి గంజాయి మత్తులో ఉన్న ముఠా పరారైంది. వెంబడించిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన యువకులకు గంజాయి నిర్ధారణ పరీక్ష చేయగా ఇద్దరు గంజాయి సేవించినట్లుగా పరీక్షల్లో తేలింది. గంజాయి సేవించిన యువకులపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు. గాయాలపాలైన బాదిత యువకులను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఇటీవల బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లికి చెందిన ఓ యువకుడిపై సైతం ఇంటికి వచ్చి మరీ మందమర్రికి చెందిన యువకులు గంజాయి మత్తులో దాడి చేశారు. సింగరేణిలో గంజాయి మత్తులో తూగుతున్న ముఠాల సంఖ్య పెరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు కఠిన చర్యలు చేపట్టకపోతే అమాయకుల ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు మంచిర్యాల జిల్లా వాసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.