Cyber Fraud: 75 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.5.40కోట్లు కాజేసిన సైబర్‌ గ్యాంగ్‌.. చివరికి..!

|

Jul 24, 2024 | 7:58 AM

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీకి తగ్గట్లుగా అప్‌డేట్‌ అవుతూ అమాయక ప్రజల్ని నిండా ముంచేస్తున్నారు. ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి కోట్లలో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో 5కోట్ల రూపాయల ఘరానా మోసం వెలుగులోకి రాగా.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తి కోటి రూపాయలు పోగొట్టుకోవడం కలకలం రేపుతోంది.

Cyber Fraud: 75 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.5.40కోట్లు కాజేసిన సైబర్‌ గ్యాంగ్‌.. చివరికి..!
Cybercrime Racket
Follow us on

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీకి తగ్గట్లుగా అప్‌డేట్‌ అవుతూ అమాయక ప్రజల్ని నిండా ముంచేస్తున్నారు. ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి కోట్లలో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో 5కోట్ల రూపాయల ఘరానా మోసం వెలుగులోకి రాగా.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తి కోటి రూపాయలు పోగొట్టుకోవడం కలకలం రేపుతోంది.

దేశంలో సైబర్ నేరగాళ్లకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. అమాయక జనాలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటుగాళ్లు వారిని కోట్లలో దోచేస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లతో లాభాల ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కానీ.. సైబర్‌ మోసాల విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు.. సైబర్‌ మాఫియా బెండు తీస్తున్నారు. తాజాగా.. దుబాయ్‌ సైబర్‌ మాఫియా గుట్టురట్టు చేశారు హైదరాబాద్‌ పోలీసులు. దానిలో భాగంగా.. సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న మహ్మద్‌ ఇలియాస్‌, రిజ్వాన్‌, సయ్యద్‌ గులాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇటీవల హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన 75 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ. 5.40కోట్లు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. మనీలాండరింగ్‌ కేసులో డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు భయపెట్టి.. బాధితుడి నుంచి విడతల వారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఇందుకోసం ఈ ముగ్గురు నిందితుల బ్యాంక్‌ ఖాతాలనే సైబర్‌ నేరగాళ్లు వినియోగించగా.. ముగ్గురి దగ్గర మొత్తం 17 బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో జమ అయిన డబ్బును విత్‌డ్రా చేసి.. దుబాయిలో ఉన్న కీలక నిందితుడు ముస్తఫాకు క్రిప్టో కరెన్సీ రూపంలో పంపుతున్నట్లు తేల్చారు. అక్కడి నుంచి నగదు చైనాకు వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో కోటి కొట్టేసిన గ్యాంగ్‌

ఇదిలావుంటే.. ఇటీవల ఆన్‌లైప్‌ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల మోసాలు కూడా మరింత పెరిగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి కోటి రూపాయలు కాజేసింది ఓ కిలాడీ. పటాన్‌చెరుకు చెందిన బెజవాడ నాగార్జున్ అనే వ్యక్తిని.. వాట్సాప్ ద్వారా పరిచయమైన మహిళ.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని ప్రోత్సహించింది. మంచి లాభాలు ఉంటాయని ఆశచూపింది. ఆ మహిళ వాట్సాప్ ద్వారా పంపిన నకిలీ స్టాక్ మార్కెట్ మేసేజ్ లింక్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసింది. దాంతో.. నాగార్జున దశలవారీగా 99 లక్షల 78వేల 526 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తీరా పెట్టుబడి డబ్బులు, కమిషన్ అడగ్గా కాంటాక్ట్ కట్ చేసింది. దాంతో.. మోసపోయానని తెలుసుకున్న నాగార్జున్.. పోలీసులను ఆశ్రయించడంతో.. చాకచాక్యంగా వ్యవహరించి సుమారు 24 లక్షల రూపాయల అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించారు. మిగతా దానికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ ఖాతా నుంచి రూ. 5లక్షలు స్వాహా

మరోవైపు… మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి 5లక్షల రూపాయలు పోగొట్టుకుంది. తూప్రాన్‌ మున్సిపాలిటీకి చెందిన యువతికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. ఇంటర్నేషనల్‌ కొరియర్‌ వచ్చిందని సమాచారం ఇచ్చారు. దాంతో నిజమేనని నమ్మిన ఆ యువతిని.. సైబర్‌ నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టారు, ఆమె అకౌంట్‌ నుంచి ఐదు లక్షలు కాజేయడంతో లబోదిబోమని మొత్తుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా.. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ బూచోళ్లు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో.. అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…