Telangana: మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ! ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఆదివారం (జనవరి 28) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ కృష్ణ మానస కాలనీ బైపాస్ అయిన అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వస్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది..

Telangana: మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ! ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Miryalaguda Car Accident

Updated on: Jan 29, 2024 | 7:04 AM

మిర్యాలగూడ, జనవరి 29: నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఆదివారం (జనవరి 28) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ కృష్ణ మానస కాలనీ బైపాస్ అయిన అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వస్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. మృతులను మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్‌ (32), ఆయన భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), తోడల్లుడు మహేశ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్‌ (32), ఆయన కుమారుడు లియాన్సీ (2)గా గుర్తించారు. వీరంతా ప్రమాద స్థలిలో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెరుపల్లి మహేశ్‌ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు భార్య జ్యోతి, కుమార్తె రిషిత, తోడల్లుడు మహేశ్‌, భూమా మహేందర్‌, ఆయన కుమారుడు లియాన్సీ కలిసి కారులో జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మోపిదేవి దైవదర్శనానికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తున్నారు. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారి వద్ద మలుపు తిరిగితే మరో మూడు, నాలుగు నిమిషాల్లో ఇంటికి చేరేవారు. కానీ అంతలోనే మృత్యువు వారిని కబలించింది. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో మహేందర్‌ భార్య భూమా మాధవి మినహా మిగతా అందరు సంఘటనా స్థలంలోనే తనువు చాలించారు. తీవ్ర గాయాల పాలైన మాదవిని స్థానికులు రక్షించి, సమీప ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆమెకు అత్యవసర చికిత్స అందించి తరువాత మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండో పట్టణ ఎస్సై క్రిష్టయ్య ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై క్రిష్టయ్య మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.