
కాలం పరిగెడుతోంది.. బాధ్యతలు పెరిగాయి.. కానీ ఆ మనసులు మాత్రం మళ్లీ బాల్యంలోకి ఎగిరిపోయాయి. అక్షరాల సాక్షిగా మొదలైన ఆ స్నేహం, నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే ఉత్సాహంతో ఒక్కటైంది. నల్గొండ గీతా విజ్ఞాన స్కూల్ 1985-1986 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు సుమారు 40 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి తమ చిన్ననాటి స్మృతులను నెమరువేసుకున్నారు. నల్గొండలోని స్థానిక వెంకటేశ్వర రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన సుమారు 52 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. చిన్ననాటి ఫ్రెండ్స్‌ను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఎవరు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎవరి జీవితాల్లో ఎలాంటి కష్టసుఖాలు ఉన్నాయి? అనే విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలో తాము చదువుకున్న స్కూల్‌ను మళ్లీ చూడాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా, అప్పటికప్పుడు ఒక బస్సును ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి తమ బడికి బయలుదేరారు. 40 ఏళ్ల తర్వాత మళ్లీ స్కూల్ యూనిఫామ్ లేకపోయినా స్నేహం అనే యూనిఫామ్‌తో అందరూ కలిసి బస్సులో వెళ్తూ చిన్నపిల్లల్లా మారిపోయారు. పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు తమ పాత తరగతి గదులను చూసి పరవశించిపోయారు. నేను ఇక్కడే కూర్చునేవాడిని, ఈ బెంచీ మీద మన పేర్లు చెక్కాం కదా, ఆ మూల కూర్చుని సార్‌కి తెలియకుండా ముచ్చట్లు పెట్టేవాళ్లం..అంటూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ చిన్నపిల్లలైపోయారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ సందడిలో ఆనాటి ఆటపాటలు, జ్ఞాపకాలు అన్నీ కళ్ల ముందుకు వచ్చాయి. 40 ఏళ్ల గ్యాప్‌ను కేవలం కొన్ని గంటల్లో తీర్చుకున్న ఆ అనుభూతి అద్భుతమని వారు అన్నారు. “మళ్ళీ కలుద్దాం.. ఈ స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దాం” అని చెప్తూ వీడ్కోలు చెప్పుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..