AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!

ఆయువు గట్టిదైతే చావు అంచుల్లోకి వెళ్లినా ప్రాణాలు దక్కుతాయంటారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఒక విచిత్ర ప్రమాదం సరిగ్గా ఈ మాటను నిజం చేసింది. విధి ఎంత బలీయమైనదో, ఒక్కోసారి అదృష్టం కూడా అంతే బలంగా ప్రాణాలను కాపాడుతుందని ఈ ఘటన నిరూపించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై, ఎలాంటి గాలివాన లేకపోయినా అకస్మాత్తుగా ఒక భారీ వృక్షం కూలిపడింది.

ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!
Ambulance Accident
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 16, 2026 | 10:41 PM

Share

ఆయువు గట్టిదైతే చావు అంచుల్లోకి వెళ్లినా ప్రాణాలు దక్కుతాయంటారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఒక విచిత్ర ప్రమాదం సరిగ్గా ఈ మాటను నిజం చేసింది. విధి ఎంత బలీయమైనదో, ఒక్కోసారి అదృష్టం కూడా అంతే బలంగా ప్రాణాలను కాపాడుతుందని ఈ ఘటన నిరూపించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై, ఎలాంటి గాలివాన లేకపోయినా అకస్మాత్తుగా ఒక భారీ వృక్షం కూలిపడింది. చూసేవారంతా ఒక్కసారిగా గుండె గుభేల్‌మనేలా చేసిన ఈ విచిత్ర సంఘటన వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన సమ్మక్క అనే మహిళ తీవ్రమైన డయాబెటిస్ (మధుమేహం) సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు మొదట నర్సంపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌ను ఆశ్రయించారు. సమ్మక్కను ఎక్కించుకుని 108 అంబులెన్స్ వరంగల్ వైపు వేగంగా దూసుకుపోతోంది. వాహనంలో పేషెంట్‌తో పాటు అంబులెన్స్ టెక్నీషియన్ అజిత్ భాషా, డ్రైవర్, రోగి బంధువులు ఉన్నారు. క్షణక్షణం ప్రాణంతో పోరాడుతున్న సమ్మక్కను కాపాడుకునేందుకు అంబులెన్స్ సిబ్బంది శ్రమిస్తున్నారు.

అంబులెన్స్ లక్నేపల్లి శివారు ప్రాంతంలోకి రాగానే ఊహించని ప్రమాదం వెంటాడింది. సాధారణంగా వర్షాలు పడినప్పుడో, ఈదురు గాలులు వీచినప్పుడో రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూలిపోతుంటాయి. కానీ, అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. గాలి లేదు, వాన లేదు. అయినా సరే, రోడ్డు పక్కనే ఉన్న దాదాపు 40 ఏళ్ల నాటి ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా, ఒక్కసారిగా ప్రయాణిస్తున్న 108 అంబులెన్స్‌పై విరిగిపడింది. మహావృక్షం ఒక్కసారిగా వాహనంపై పడటంతో పెద్ద శబ్దం వచ్చింది. అంబులెన్స్ పైభాగం పూర్తిగా నలిగిపోయింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అంబులెన్స్ లోపల ఉన్నవారు భయాందోళనలతో కేకలు వేశారు.

ఆయువు తీరితే గడ్డిపోచ కూడా తాచుపామై కాటేస్తుంది అంటారు. కానీ ఇక్కడ సమ్మక్క ఆయువు గట్టిది కావడంతో ఇంత పెద్ద ప్రమాదం నుండి ఆమె ప్రాణాలతో బయటపడింది. భారీ వృక్షం పడినప్పటికీ, అంబులెన్స్ క్యాబిన్ లోపల ఉన్న రోగి సమ్మక్కకు, అంబులెన్స్ టెక్నీషియన్ అజిత్ భాషాకు స్వల్ప గాయాల మాత్రమే అయ్యాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం, చెట్టు పడిన కోణం కొద్దిగా మారడంతో పెను ప్రమాదం తప్పింది. లోపల ఉన్నవారందరూ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సమయం వృధా చేయకుండా ఒక జేసీబీ యంత్రాన్ని రప్పించి, అంబులెన్స్‌పై పడిన భారీ వృక్షాన్ని మరియు కొమ్మలను తొలగించారు. అనంతరం, తీవ్ర అస్వస్థతతో ఉన్న సమ్మక్కను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్న మరో 108 అంబులెన్స్ వాహనంలోకి సురక్షితంగా మార్చారు. అక్కడ నుండి ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా, ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడం, చెట్టు అడ్డంగా పడిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు చెట్టును పూర్తిగా తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. చావు అంచుల్లోకి వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చిన సమ్మక్క ఉదంతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us