
అంతా పెళ్లి సందడిలో ఉన్నారు.. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఇల్లు సందడిగా మారింది.. మంచిగా డీజే పెట్టి.. పాటలతో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఊహించని ఘటన చోటుచేసుకుంది.. డీజే సౌండుకు డ్యాన్స్ చేస్తూ ఇంటర్ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు అతన్ని .. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే.. మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితుని ఇంట్లో పెళ్లి సందడిలో డీజే సౌండుకు డ్యాన్స్ చేస్తూ ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలోని కోస్గిలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నారాయణపేట కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతులకు కుమారుడు రవితేజ (17), కుమార్తె ఉన్నారు. రవితేజ.. ఇంటర్ చదువుతున్నాడు.. ఈ క్రమంలోనే.. స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉండటంతో సోమవారం రాత్రి రవితేజ అతని ఇంటికి వెళ్లాడు. స్నేహితులంతా కలిసి ఈ సమయంలో సందడి చేస్తూ ఎంజాయ్ చేశారు.
ఇదే సమయంలో డీజే పాటలు పెట్టి డ్యాన్స్ చేశారు. అయితే.. డీజే సౌండ్ కు రవితేజ హఠాత్తుగా కుప్పకూలాడు. స్పృహ తప్పి పడిపోయిన రవితేజను స్నేహితులు, స్థానికులు వెంటనే.. కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రవితేజ కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన యువకుడు.. గుండెపోటుతో చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది.
కాగా.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగిన సందర్భాలున్నాయి.. అందుకే.. డీజే సౌండ్స్ విషయంలో జాగ్రత్త అంటూ పలువురు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..