Nalgonda: 2014లో మిస్సింగ్.. 11 ఏళ్ల తర్వాత కన్నవారికి చేరిన కుమార్తె.. ఎలాగంటే..?

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ చిన్నారి. రోజులు గడిచాయి.. నెలలు గడిచాయి.. ఏళ్లు గడిచాయి. కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. కన్నవారు ఎన్నిసార్లు వెతికినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుండి కన్న బిడ్డ కోసం కన్నీరు అవుతూనే ఉన్నారు. కాలం గడిచేకొద్దీ తమ బిడ్డ తిరిగి వస్తుందన్న ఆశ కూడా సన్నగిల్లిపోయింది. కానీ.. ఒక కార్డు ఆ కుటుంబంలో మళ్లీ వెలుగులు నింపింది.

Nalgonda: 2014లో మిస్సింగ్.. 11 ఏళ్ల తర్వాత కన్నవారికి చేరిన కుమార్తె.. ఎలాగంటే..?
Family Reunion

Edited By:

Updated on: Sep 09, 2026 | 11:42 AM

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వాలపల్లికి చెందిన ఓ దంపతులకు మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దానమ్మ ఉంది. ఈమెకు 12 ఏళ్లున్నప్పుడు.. 2014లో తల్లిదండ్రులు పనికి వెళ్లగా, బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లింది. సదరు బాలిక తప్పిపోయి హైదరాబాద్‌కు చేరుకుంది. పోలీసులు గుర్తించి అక్కడి స్టేట్ హోంకు తరలించారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు తమ బిడ్డ కోసం వెతుకుతూనే ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పాటు తెలిసిన ప్రాంతాలన్నింటిలోనూ ఆచూకీ కోసం ప్రయత్నించారు. కానీ కాలం మాత్రం కదులుతూనే ఉంది. చిన్నారిగా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ అమ్మాయి.. సంవత్సరాలు గడిచే కొద్దీ పెద్దదైంది. ఒక దశలో అసలు తమ బిడ్డ ఎక్కడుందో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మరోవైపు ఆ బాలికను హైదరాబాద్ స్టేట్ హోం నుండి మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మగ్దుంపూర్ బేతని సంరక్షణ ఆశ్రమంలో చేర్పించారు. బాలిక తల్లిదండ్రుల ఆచూకీకి అధికారులు ఎన్నోమార్లు యత్నించినా ఫలితం లేకపోయింది. బాలికకు ఆధార్ కార్డు కోసం అధికారులు దరఖాస్తు చేసినా అప్పటికే ఉండటంతో తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం ఇప్పుడామెకు 23 ఏళ్లు. ఇటీవల హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ప్రధాన కార్యాలయంలో యువతి వివరాలు నమోదు చేయించే ప్రయత్నం చేశారు. ఆమెకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించే క్రమంలో ఆధార్‌ కార్డు కీలక ఆధారంగా మారింది. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసి డౌన్లోడ్ చేశారు. గుర్తింపును నిర్ధారించే ప్రక్రియలో అధికారులకు చిరునామాకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. ఆ వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు.

ట్విస్ట్‌ ఇచ్చిన ఆధార్‌!..

ఆధార్ కార్డు వివరాల ఆధారంగా అధికారులు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామ సర్పంచిని సంప్రదించారు. 11 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన బాలిక తప్పిపోయిన విషయం నిజమేనని తేలడంతో బాలిక తల్లిదండ్రులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చివరకు ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన అమ్మాయి.. ఇదే కుటుంబానికి చెందినదని నిర్ధారణ కావడంతో అధికారులు కుటుంబానికి సమాచారం అందించారు.

కన్నవారి కళ్లల్లో కన్నీళ్లు.. ఆనందానికి అవధుల్లేవ్‌!

పదకొండేళ్లుగా తమ కూతురి కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు.. ఆమె ఆచూకీ దొరికిందన్న వార్త వినగానే కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. మెదక్ బాలసదనం జిల్లా సంకేమాధికారిణి హేమ భార్గవి సమక్షంలో యువతిని తల్లికి అప్పగించారు. 11 ఏళ్ల తర్వాత తల్లి దగ్గరికి చేరడంపై ఆ యువత సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

11 ఏళ్ల నిరీక్షణకు.. ఒక ఆధార్‌ కార్డు ముగింపు..

చిన్నప్పుడు తప్పిపోయిన చిన్నారి.. తమ చేతుల్లో నుంచి జారిపోయిన బిడ్డ.. ఇన్నేళ్ల తర్వాత పెద్దదై తిరిగి తమ ముందుకు వచ్చింది. దీంతో 11 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. కన్నీళ్లతో మొదలైన వెతుకులాట.. ఆనందబాష్పాలతో ముగిసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us