Moon Collides Earth: విశ్వం అనేక గ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, ఉల్కాపాతాలతో నిండి ఉంది. అందులో భూమి కూడా ఒకటి. అయితే, ఏ క్షణం ఏవైపు నుంచి భూమికి ప్రమాదం పొంచి ఉందనేది చెప్పలేం. ఇప్పటికే ఎన్నో గ్రహ శకలాలు, ఉల్కలు భూమివైపు దూసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. వాటిని మన సైంటిస్టులు చాకచక్యంగా డైవర్ట్ చేయగలగడంతో.. అంతా సేఫ్ అయ్యింది. అయితే, ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి చర్చించుకుందాం. చల్లని వెన్నెల కురిపించే చందమామ భూమిని ఢీకొంటే ఏమవుతుందో తెలుసా? అసలు ఎప్పుడైనా అలా ఆలోచించారా?.. అయినా, చందమామ భూమిని ఢీకొట్టడమేంటి అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? జస్ట్ కాసేపు అలా అనుకుందాం.. ఒక వేళ చందమామ భూమివైపు దూసుకొస్తే ఏమవుతుందో తెలుసుకుందాం..
చందమామ భూమివైపు రావాలంటే.. ముందుగా రోచ్ లిమిట్ (Roche Limit)కి చేరుకోవాలి. ఇది భూమికి 18,470 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భూమికి ఒక రక్షణ కవచంలాంటిది. ఈ లిమిట్ దాటి లోపలికి ఏ అంతరిక్ష పదార్థం వచ్చినా.. అది ముక్కలైపోతుందట. సపోజ్ ఏ గ్రహశకలమో రోచ్ లిమిట్ దాటి భూవాతావరణంలోకి వస్తే.. ముక్కలవడమే కాదు.. రాపిడికి కాలిపోతుందట కూడా. చందమామ కూడా రోచ్ లిమిట్ లోకి రాగానే పేలిపోతుందట. అలా చందమామ పేలిపోగానే… భారీ శబ్దాలు వస్తాయట, సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయట, అవి ఎంత పెద్దవంటే.. అలలు 30,000 అడుగుల ఎత్తుకు లేస్తాయట, భారీ సునామీలు కూడా వచ్చే ప్రమాదముందట. మొత్తం మానవాళిని, జీవరాశినీ అవి సముద్ర నీటిలో ముంచేస్తాయట. భూమి తిరిగే వేగం తగ్గిపోయి.. ఒర రోజు కాలం 24 గంటలకు బదులు 30 గంటలకు చేరుతుందట.
పేలిన చందమామ నుంచి రకరకాల రాళ్లు అంతరిక్షంలో రివ్వున తిరుగుతాయి. ఈ సమయంలో చూస్తుండగానే.. చందమామ భూమి చుట్టూ ఓ రింగ్‌లా తయారవుతుంది. అది భూమధ్య రేఖకు 37,000 కిలోమీటర్ల వరకూ ఏర్పడుతుందట. ఈ రాళ్లు భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లను సర్వనాశనం చేస్తాయట. ఆ రింగ్ నుంచి రాళ్లు.. వేగంగా భూమివైపు దూసుకొస్తాయి. అవి మండే అగ్నిగోళాల్లా మారి… భూమిపై పెను ప్రకంపనలు సృష్టిస్తాయట. నగరాలకు నగరాలు బూడిదలా మారిపోతాయట. ప్రజలు, ప్రాణులు, చెట్లు చాలా వరకూ చనిపోతాయి. కొన్ని వారాలపాటు.. ఇలా చందమామ నుంచి రాళ్లు భూమిపైన పడతాయట. అప్పటికే భూమి నాశనం అయిపోగా.. మిగిలిన వారు రకరకాల అనారోగ్యాలతో బతికినా క్షణమొక యుగంలా మారుతుందట. అంటే.. చందమామ పొరపాటున భూమిని ఢీకొట్టే ప్రయత్నం చేస్తే జరిగే పరిణామాలు ఇవన్నమాట. ఇదంతా ఊహాగానమే.. భయపడాల్సిందేమీ లేదు. ఒకవేళ చందమామ భూమిని ఢీకొంటే ఏం జరుగుతుందని శాస్త్రవేత్తలు ఇలా అంచనా వేశారంతే.
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..