
ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా సోషల్ మీడియా సాయంతోనే అది తెలిసిపోతోంది. కొందరికి వారి నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా మారుతోంది. మరికొందరికీ ఆదాయ మార్గంగా కూడా మారుతోంది. ఇంకొందరికీ టైం పాస్ కోసం సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. చాలా మంది వారి వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటున్నారు. కొత్త కారు కొన్నామని, కొత్త వస్త్రాలు ధరించామని, బంధువులు ఇంటికి వచ్చారని ఇలా ఏదైనా వాటిల్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ చాటింగ్ అంటూ వాటికి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్. ఈ ప్లాట్ ఫారంలో ఉండే రీల్స్, స్టోరీస్ యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రతి విషయాన్ని అందులో షేర్ చేసుకోవడం, భావాలను పంచుకోవడం అలవాటైపోతోంది. దీంతో అవి లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా వీటికి అడిక్ట్ అయిపోయిన వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల పెరిగిపోతోంది. ఫలితంగా ఇతరులతో కలవలేకపోవడం, డిప్రెషన్ గురవడం కారణంగా మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఎలా? అందుకు చేయాల్సిన పనులేమిటి? అసలు అది సాధ్యమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం రండి..
కొందరు రోజుకు 5 నుంచి 6 గంటలకు పైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, వారు దానికి బానిస అవుతారంటున్నారు. మద్యం, సిగరెట్లు ఎలా వ్యసనంగా మారుతున్నాయో సోషల్ మీడియా కూడా అంతే వ్యసనంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు వర్చువల్ ప్రపంచంలో జీవించడం ప్రారంభించారని.. దీనివల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని చెబుతున్నారు. ఇతరులలా ఉండాలనే కోరిక మానసిక ప్రశాంతతను నాశనం చేస్తోందంటున్నారు. అటువంటి పరిస్థితిలో, పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఇలా చేయకపోతే అది మీ మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని.. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్ర నిరాశను కూడా కలిగిస్తుందని చెబుతున్నారు.
దీనికి సంబంధించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. రోజులో 1 గంట కంటే తక్కువ సమయం సోషల్ మీడియాను ఉపయోగించాలనే విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. వీలైతే, కొన్ని రోజులు వాటిని ఉపయోగించడం మానేయండి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సెల్ ఫోన్ ను దూరంగా ఉంచండి. సోషల్ మీడియాలో స్టేటస్ ను చూడకండి. వాటి గురించి ఆలోచించకండి. ఒకవేళ రాత్రి వేళ నిద్రకు భంగం కలిగితే అది డిప్రెషన్ కు దారి తీయొచ్చు. అందుకే క్వాలిటీ నిద్ర ప్రతి మనిషికీ అవసరం.
నిరంతరం సోషల్ మీడియాను వినియోగించడం అలవాటుగా మారితే.. దానిని పరిహరించండి. ఏదో ఒక సమయంలోనే వినియోగించడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు లంచ్ సమయంలోనే దీన్ని రొటీన్‌గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. రాత్రిపూట సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించడం మానేయండి. తొలుత ఇది మీకు అలవాటు కావాలంటే కొన్ని రోజుల పాటు సోషల్ డిటాక్స్ చేసేయండి.. అవసరం అయితే కొంత కాలం పాటు సోషల్ మీడియా యాప్‌లను ఫోన్లో అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అప్పుడు మీకు సోషల్ మీడియా అడిక్షన్ కొంత వరకూ తగ్గుతుంది. ఆ తర్వాత కొద్ది సమయం మాత్రమే వినియోగించడం, అది కూడా నిర్ణీత సమయం వరకూ మాత్రమే చూడటం అలవాటు చేసుకోండి. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..