ఫిట్‌నెస్ లవర్స్‌కు షాక్ ఇచ్చే ఫీచర్లతో Samsung Galaxy Fit 4 బ్యాండ్.. స్పెషాలిటీస్ ఇవే
ఫిట్‌నెస్ ట్రాకర్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. రోజువారీ అడుగుల లెక్కింపు నుంచి హార్ట్‌రేట్, నిద్ర వివరాల వరకు ఎన్నో ఆరోగ్య సంబంధిత అంశాలను తెలుసుకునేందుకు చాలామంది ఈ బ్యాండ్లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ Samsung నుంచి మరో కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అదే Samsung Galaxy Fit 4. కంపెనీ ఇప్పటివరకు ఈ డివైజ్‌ను అధికారికంగా ప్రకటించలేదు.

గతంలో విడుదలైన Galaxy Fit 3తో పోలిస్తే కొత్త మోడల్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హెల్త్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే ఫీచర్లపై Samsung దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. యాప్‌లో కనిపించిన వివరాల ప్రకారం ఈ బ్యాండ్‌లో కొత్త టైల్స్, Find My Phone ఆప్షన్‌తో పాటు అనేక ఆరోగ్య సంబంధిత ఫీచర్లు ఉండొచ్చు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి లీకైన వివరాలు మాత్రమే. తుది ఫీచర్లు, ధర, లాంచ్ తేదీపై కంపెనీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని కీలక వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. Galaxy Fit 4 మేనేజర్ యాప్‌ను పరిశీలించినప్పుడు కొత్త బ్యాండ్ డిస్‌ప్లే, కలర్స్, ఫీచర్లకు సంబంధించిన సమాచారం లభించినట్లు Sammyguru వెల్లడించింది.
కొత్త ఆప్షన్లు
Galaxy Fit 4లో గత మోడల్‌తో పోలిస్తే కొంచెం పొడవైన డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. మేనేజర్ యాప్‌లో కనిపించిన వాచ్ ఫేస్ చిత్రాల రిజల్యూషన్ 258 x 428 పిక్సెల్స్‌గా ఉంది. దీన్ని బట్టి స్క్రీన్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి రావచ్చని అంచనా. అలాగే ఇందులో గరిష్టంగా 12 టైల్స్‌ను యాడ్ చేసుకునే సదుపాయం ఉండొచ్చు. దీంతో తరచుగా ఉపయోగించే ఫీచర్లను త్వరగా ఓపెన్ చేయవచ్చు.
ఫోన్ ఎక్కడ పెట్టామో మర్చిపోయినప్పుడు బ్యాండ్ నుంచే రింగ్ చేసే Find My Phone ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్లు ఫోన్‌లో, బ్యాండ్‌లో ఎలా కనిపించాలో ఎంచుకునే సెట్టింగ్స్ కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.
హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు
ఆరోగ్యానికి సంబంధించిన పలు ఫీచర్లు Galaxy Fit 4లో ఉండొచ్చని లీకైన సమాచారం సూచిస్తోంది. స్టెప్స్, యాక్టివ్ టైమ్, కేలరీల లెక్కింపుతో పాటు హార్ట్‌రేట్, స్ట్రెస్, నిద్ర వివరాలను ట్రాక్ చేయవచ్చు. స్లీప్ స్టేజెస్, స్లీప్ స్కోర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, నిద్రలో గురకను గుర్తించే ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు వర్కౌట్ ట్రాకింగ్, ఆటోమేటిక్ యాక్టివిటీ గుర్తింపు, శ్వాస వ్యాయామాలు, పీరియడ్స్ ట్రాకింగ్, నీరు, ఆహారం వివరాలను నమోదు చేసే ఆప్షన్లు కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.
ఇక GPS విషయానికి వస్తే.. ఇప్పటివరకు లీకైన యాప్ వివరాల్లో దీనికి సంబంధించిన సమాచారం కనిపించలేదు. అయితే దీనివల్ల కొత్త బ్యాండ్‌లో GPS ఉండదని ఇప్పుడే నిర్ధారించలేం. వ్యాయామ వివరాలను Samsung Health యాప్‌తో సింక్ చేసుకునే అవకాశం ఉంది. ధర, లాంచ్ తేదీపై Samsung ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్‌లో Galaxy Fit 3ను ఫిబ్రవరి 2024లో రూ.4,999 ధరతో విడుదల చేసింది. Galaxy Fit 4 ధర ఎంత ఉండనుందో అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత వస్తుంది.
