టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం ఎలాంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ఆకాశాన్నంటేలా ఉన్న ఇంటర్నెట్ ధరలు జియో రాకతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ప్రతీ ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక జియో ఫైబర్ పేరుతో మారుమూల గ్రామాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తోంది జియో.
ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జియో.. ల్యాప్‌టాప్ రంగంలోనూ సరికొత్త అధ్యయానికి తెర తీసింది. ఇప్పటికే జియో బుక్, జియో బుక్ 4జీ పేరు రెండు ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో ఇప్పుడు మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో విడుదల చేసిన జియో బుక్ 4జీ ధర రూ. 16,000గా ఉండగా, ఇప్పుడు తీసుకొచ్చే జియో క్లౌడ్ పీసీని కేవలం రూ. 15,000కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. జియో క్లౌడ్ పీసీ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. ఇంతకీ ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏంటి.? ఇంత తక్కువ ధరకు ఎలా లభించనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జియో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు గాను ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలైన హెచ్‌పీ, లెనోవా, ఏసర్‌లతో చర్చలు జరుపుతోంది. ఇక ల్యాప్‌టాప్‌ను తక్కువ ధరకు తీసుకొచ్చేందుకు గాను జియో క్లౌడ్ పీసీనీ తీసుకొస్తోంది. ఈ విషయమై కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ల్యాప్‌టాప్ ధరను అందులోని స్టోరేజ్, ప్రాసెసర్, చిప్‌సెట్, బ్యాటరీతోపాటు ఇతర హార్డ్‌వేర్ భాగాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటి ధర పెరిగితే దాని ప్రభావం తప్పక ల్యాప్‌టాప్ ధరపై ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు జియో క్లౌడ్ పీసీని తీసుకొస్తున్నాం. ఇందులో సిస్టమ్ ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దీనివల్ల తక్కువ ధరకే వినియోగదారులకు ల్యాప్‌టాప్ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పుకొచ్చారు.
అయితే జియో క్లౌడ్ పీసీ కేవలం ఒక యాక్సెస్ డివైజ్‌లానే పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌లో జరిగే ప్రాసెస్ అంతా బ్యాగ్రౌండ్‌లో జియో క్లౌడ్‌లో ఉంటుందన్నమాట. దీంతో యూజర్లు వేగవంతమైన సేవలు పొందొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి హెచ్‌పీ క్రోమ్ బుక్‌లో కూడా టెస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్ ధర తక్కువే అయినా.. క్లౌడ్ సేవలు వినియోగించుకోవడం కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక జియో ల్యాప్‌టాప్ కాకుండా కేవలం జియో క్లౌడ్ పీసీ సాఫ్ట్‌వేర్‌ను కూడా అందిస్తుంది. దీంతో యూజర్లు తమ ల్యాప్‌టాప్స్ లేదా స్మార్ట్ టీవీలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని కంప్యూటింగ్ సేవలను పొందొచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..