AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్ వానలో తడిసిందా.. కంగారులో ఈ తప్పులు అస్సలు చేయకండి..

వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్ గనుక వానకు తడిస్తే కంగారులో ఏది పడితే అది చేయకండి. ఫోన్ పని చేస్తుందో లేదోనని ఆన్ చేయడం, చార్జింగ్ పెట్టడం లేదా హెయిర్ డ్రైయర్ వాడటం వంటి పనులు చేస్తే.. మీ చేతులారా ఫోన్‌ను శాశ్వతంగా ముక్కలు చేసుకున్నట్లే. అసలు ఏం చేయాలో తెలుసుకుందాం..

మీ ఫోన్ వానలో తడిసిందా.. కంగారులో ఈ తప్పులు అస్సలు చేయకండి..
How To Fix Water Damaged Phone At Home
Krishna S
|

Updated on: Jul 06, 2026 | 2:21 PM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి గొడుగు లేదా రెయిన్‌కోట్ మర్చిపోయి బయటకు వెళ్తుంటాం. హఠాత్తుగా వాన పడితే తడిసిపోతామనే బాధ కంటే.. మన జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్ పాడైపోతుందేమో అన్న భయమే అందరినీ ఎక్కువగా వెంటాడుతుంది. ఒకవేళ పొరపాటున మీ మొబైల్ వర్షంలో తడిసిపోతే.. అస్సలు కంగారు పడకండి. ఇంటి దగ్గరే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ ఫోన్‌ను సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే చాలా మంది ఫోన్ తడవగానే కొన్ని పెద్ద తప్పులు చేస్తుంటారు. అవేంటో, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం..

ఫోన్ తడిస్తే వెంటనే చేయాల్సిన మొదటి పని..

మీ ఫోన్ వానలో తడిసిపోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. ఒకవేళ ఫోన్ అప్పటికే ఆఫ్‌ అయిపోయి ఉంటే.. అది పని చేస్తుందో లేదో చెక్ చేయడానికి దాన్ని అస్సలు ఆన్ చేయకండి. ఫోన్ ఆన్ చేయడమే మీరు చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే లోపలికి వెళ్లిన నీటి వల్ల ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. తద్వారా మొబైల్ మదర్‌బోర్డ్ పూర్తిగా కాలిపోతుంది.

ఫోన్ తడిచినప్పుడు అస్సలు చేయకూడని 3 పెద్ద తప్పులు..

ఛార్జింగ్ పెట్టకండి: ఫోన్ ఆన్ కావడం లేదని లేదా ఆన్ అవుతుందో లేదో చూడటానికి వెంటనే చార్జింగ్‌కు కనెక్ట్ చేయకండి. తడిచిన ఫోన్‌కు పవర్ సప్లై ఇస్తే మొబైల్ లోపల పెద్ద బ్లాస్టింగ్ లేదా స్పోటం జరిగే అవకాశం ఉంది.

హెయిర్ డ్రైయర్ వాడకండి: చాలా మంది ఫోన్‌ను ఆరబెట్టడానికి ఇంట్లో ఉండే హెయిర్ డ్రైయర్ వాడుతుంటారు. డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలికి ఫోన్ లోపల ఉండే ప్లాస్టిక్ భాగాలు, స్క్రీన్ కరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు డ్రైయర్ గాలి ప్రెజర్‌కు బయట ఉన్న నీటి చుక్కలు ఫోన్ లోపలికి మరింత బలంగా వెళ్తాయి.

ఫోన్‌ను గట్టిగా ఊపకండి: ఫోన్ లోపల నీరు పోయిందని గట్టిగా ఊపడం వల్ల,పైన ఉన్న నీరు కూడా స్పీకర్‌ గ్రిల్స్ లేదా చార్జింగ్ పోర్ట్ ద్వారా లోపలి భాగాలకు పాకుతుంది.

ఇంట్లోనే ఫోన్‌ను సురక్షితంగా ఆరబెట్టే సులువైన టిప్స్..

సిమ్ ట్రేని తొలగించండి: ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే, సిమ్ టూల్ ఉపయోగించి సిమ్ కార్డ్, మెమరీ కార్డులను బయటకు తీసి పక్కన పెట్టండి. దీనివల్ల ఫోన్ లోపలికి గాలి ఆడుతుంది.

పొడి బట్టతో తుడవండి: ఒక శుభ్రమైన, పొడి కాటన్ క్లాత్ లేదా టిష్యూ పేపర్ తీసుకుని మొబైల్ స్క్రీన్, బ్యాక్ ప్యానెల్, మూలలను తడి లేకుండా జాగ్రత్తగా తుడవండి.

బియ్యం డబ్బా ట్రిక్: ఫోన్ పైన తడి ఆరిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా బియ్యం ఉన్న డబ్బాలో కనీసం 24 నుండి 48 గంటల పాటు ఉంచండి. బియ్యానికి తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ లోపల ఉన్న తడి ఆరిపోతుంది.

వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు ఫోన్ కోసం ఒక చిన్న ప్లాస్టిక్ జిప్ లాక్ కవర్ వెంట ఉంచుకోవడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఒకవేళ పైన చెప్పిన చిట్కాలు పాటించిన తర్వాత కూడా ఫోన్ ఆన్ కాకపోతే సొంత ప్రయోగాలు ఆపేసి వెంటనే అధీకృత మొబైల్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.

Follow Us