గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది తెలియని వారు పెద్దగా ఉండరేమో. ప్రతి ఒక్కరికీ ఇది సుపరిచితమే. ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లినా? అడ్రస్ సరిగ్గా తెలియక పోయినా గూగుల్ మ్యాప్స్ ఆధారంగానే వెళ్లగలుగుతున్నారు. ఎంచక్కా నావిగేషన్ పెట్టుకొని ముందుకు వెళ్లిపోతున్నారు. ఇక ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ లు, ర్యాపిడో బైక్స్ అయితే ఈ మ్యాప్స్ ఆధారంగానే నడుస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ గూగుల్ మ్యాప్స్ లో ఓ కొత్త ఫీచర్ మన దేశంలోని వినియోగదారులకు పరిచయం అయ్యింది. దీని పేరు ఫ్యూయల్ సేవింగ్ అంటే మీ బైక్ లేదా కారు ఇంధనాన్ని ఆదా చేసే ఫీచర్. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ కథనాన్ని పూర్తి చదవండి.
గూగుల్ మ్యాప్స్ లో ఈ సేవింగ్ ఫ్యూయల్ ఫీచర్ 2022లోనే ఆవిష్కరించారు. అయితే మొదటిగా యూఎస్, కెనడా, యూరోప్ దేశాలలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో కూడా దీనిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త ఫీచర్ యాప్ లో యాడ్ అవడంతో మీ వాడే బండిలో వాడే ఇంధనం (పెట్రోల్/డీజిల్/సీఎన్జీ/విద్యుత్) ఆదా అవుతుంది. అదెలా సాధ్యం అంటే..
గూగుల్ మ్యాప్స్ వినియోగించి మీరు వాహనాన్ని నడుపుతున్నప్పుడు మీరు వాడే వాహనం ఇంజిన్ రకాన్ని బట్టి మీకు వివిధ మార్గాలు, ఆయా రూట్లలో వెళ్లడం వల్ల ఆదా అయ్యే ఇంధన వివరాల అంచనాలను చూపిస్తుంది. అలాగే లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, రహదారి పరిస్థితులతో పాటు ఇంధనం ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తుంది. అంతేకాక మీరు వెళ్లే వేగం, ఇంధన సంరక్షణ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యంత అనుకూలమైన మార్గాన్ని లెక్కిస్తుంది. మీ మార్గాలు మారినప్పటికీ, యాప్ అత్యంత సమర్థనీయమైన ఇంధన ఆదా మార్గాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే వేగవంతమైన మార్గాన్ని ప్రదర్శించకుండా వేరు చేస్తుంది. అలాగే గ్రీన్ లీఫ్ సింబల్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లలో అత్యంత పర్యావరణ అనుకూల మార్గాన్ని చూపిస్తుంది.
ఫ్యూయల్ ఎఫీషియెంట్ మార్గం మీ బండి ఇంజిన్ రకాన్ని బట్టి మారుతుంటుంది. ఇక్కడ సరైన ఇంజిన్ రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. డీజిల్ వాహనాలు తరచుగా హైవేలపై మెరుగ్గా పనిచేస్తాయి. అయితే హైబ్రిడ్. ఎలక్ట్రిక్ వాహనాలు పునరుత్పత్తి బ్రేకింగ్ కారణంగా నగరం లేదా కొండ ప్రాంతాలలో ఎక్కువ రేంజ్ ఇస్తాయి. మీరు మీ ఇంజిన్ రకాన్ని ఎన్నుకోకపోతే, పెట్రోల్ డిఫాల్ట్‌గా మారుతుంది. ఎందుకంటే ఇది చాలా దేశాలలో అత్యంత సాధారణ ఇంజిన్ రకం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..