మనిషి ఆరోగ్యానికి మేలు చేసే చేప.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!

శాస్త్ర, వైద్య పరిశోధన రంగాల్లో నేపాల్ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక జీబ్రాఫిష్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. జన్యుశాస్త్రం, మానవ వ్యాధుల అధ్యయనం, ఔషధాల అభివృద్ధి, పర్యావరణ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడే జీబ్రాఫిష్‌లపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

మనిషి ఆరోగ్యానికి మేలు చేసే చేప.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Zebrafish

Updated on: Nov 27, 2026 | 4:42 PM

చిత్వాన్, నవంబర్ 27: శాస్త్ర, వైద్య పరిశోధన రంగాల్లో నేపాల్ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక జీబ్రాఫిష్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. జన్యుశాస్త్రం, మానవ వ్యాధుల అధ్యయనం, ఔషధాల అభివృద్ధి, పర్యావరణ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడే జీబ్రాఫిష్‌లపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నేపాల్‌లోని భరత్‌పూర్‌లో శుక్రవారం (నవంబర్ 27) నేపాల్ జీబ్రాఫిష్ ఇన్ నేచర్ సెంటర్ (N-ZINC) తన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రభుత్వ ప్రతినిధులు, విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రిషిరామ్ కట్టెల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జీబ్రాఫిష్‌లపై ఎందుకింత ఆసక్తి?

జీబ్రాఫిష్ (Danio rerio) అనేది మంచినీటిలో నివసించే చిన్న చేపల జాతి. మానవ జన్యువుల్లో సుమారు 70 శాతానికి సమానమైన జన్యువులు ఈ చేపల్లో ఉండటం శాస్త్రవేత్తలకు పరిశోధనల పరంగా ఎంతో ఉపయోగకరంగా మారింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రయోగశాలల్లో వీటిని ముఖ్యమైన నమూనా జీవులుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వీటి పిండాలు పారదర్శకంగా ఉండటంతో శరీరంలోని అవయవాల అభివృద్ధి, కణాల పెరుగుదల, జన్యుపరమైన మార్పులను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. జన్యుశాస్త్రం, అభివృద్ధి జీవశాస్త్రం, విషపదార్థాల ప్రభావం, మానవ వ్యాధుల అధ్యయనం వంటి అనేక రంగాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఔషధ పరిశోధనలకు ఉపయోగం

జీబ్రాఫిష్‌లను కొత్త ఔషధాల పరీక్షలు, వాటి ప్రభావాలను అంచనా వేయడం, విషపదార్థాల ప్రభావాన్ని గుర్తించడం వంటి పరిశోధనల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం నీటి జీవులపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. భవిష్యత్తులో వైద్య, జీవశాస్త్ర పరిశోధనలకు నేపాల్‌ను ఒక ముఖ్యమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే N-ZINC లక్ష్యంగా పెట్టుకుంది.

అమెరికా విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం

ఈ పరిశోధనా కేంద్రం ఇప్పటికే అమెరికాలోని ఒరెగాన్ విశ్వవిద్యాలయం, డ్యూక్ విశ్వవిద్యాలయాలతో సహకార ఒప్పందాలను ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు గత ఏడాది నేపాల్‌ను సందర్శించి చిత్వాన్ ప్రాంతంలో జీబ్రాఫిష్ నమూనాలను సేకరించి ప్రాథమిక అధ్యయనాలు నిర్వహించారు.

అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పరిశోధక బృంద సభ్యురాలు సరోజ్ రెగ్మి వెల్లడించిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ పరిశోధకులు వచ్చే ఏడాది మార్చిలో మరోసారి నేపాల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా మరిన్ని జీబ్రాఫిష్ సహజ ఆవాసాలను గుర్తించి, పరిశోధనలను విస్తరించనున్నారు.

నేపాల్ అంతటా పరిశోధనల విస్తరణ

N-ZINC అధ్యక్షుడు ప్రశాంత్ కాంత్ దహల్ మాట్లాడుతూ.. నేపాల్‌లో జీబ్రాఫిష్‌లు సహజంగా కనిపిస్తున్నప్పటికీ, వాటి జీవన విధానం, జన్యు లక్షణాలు, సహజ ఆవాసాలపై ఇప్పటివరకు వ్యవస్థీకృత పరిశోధనలు పరిమితంగానే జరిగాయని తెలిపారు. స్థానికంగా పరిశోధనా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అంతర్జాతీయ శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

అనేక రంగాలకు ప్రయోజనం

ఈ పరిశోధనా కేంద్రం కార్యకలాపాలు కేవలం జీవశాస్త్రం, వైద్య రంగాలకే పరిమితం కావు. వ్యవసాయం, పశువైద్య శాస్త్రం, అటవీ పరిశోధనలు, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అధ్యయనాలకు కూడా విస్తరించనున్నాయి. విద్యార్థులు, రైతులు, పరిశోధకుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంస్థ ప్రణాళికలు రూపొందించింది.

మొత్తంగా చూస్తే.. చిన్న చేప అయిన జీబ్రాఫిష్ ఆధారంగా జన్యుశాస్త్రం నుంచి వైద్య పరిశోధనల వరకు ఎన్నో అవకాశాలను అన్వేషించేందుకు నేపాల్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సహకారంతో పరిశోధనలను విస్తరించగలిగితే, భవిష్యత్తులో శాస్త్ర, వైద్య రంగాల్లో నేపాల్‌కు కొత్త గుర్తింపు లభించే అవకాశం ఉంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us