Wireless Charging: మొబైల్‌, ల్యాప్‌టాప్‌ ఇతర పరికరాలు గాలి ద్వారానే చార్జింగ్‌.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ

|

Sep 04, 2021 | 10:06 AM

Wireless Charging: కాలంతో పాటు టెక్నాలజీ కూడా పరుగులు పెడుతోంది. రోజురోజుకు టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత జీవనశైలిలో ఎలక్ట్రానిక్‌ పరికరాల..

Wireless Charging: మొబైల్‌, ల్యాప్‌టాప్‌ ఇతర పరికరాలు గాలి ద్వారానే చార్జింగ్‌.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ
Wireless Charging
Follow us on

Wireless Charging: కాలంతో పాటు టెక్నాలజీ కూడా పరుగులు పెడుతోంది. రోజురోజుకు టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత జీవనశైలిలో ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం అనేది అత్యవసరమైంది. అయితే, మొబైల్స్‌ వాడిన కొద్దిసేపటికే చార్జింగ్‌ అయిపోవడం, పవర్‌ సాకెట్‌లో కేబుల్‌ ఉంచి.. డివైజ్‌లకు గంటల తరబడి చార్జింగ్‌ పెట్టడం ప్రధాన సమస్యగా మారింది. అలా కాకుండా.. పనిచేసుకునే గదిలోనే, మీరు ఎక్కడ ఉన్నా.. మీ ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాటంతట అవే చార్జింగైతే ఎలా ఉంటుంది? ఇలాంటి టెక్నాలజీని జపాన్‌ పరిశోధకులు కనిపెట్టారు. అలాంటి టెక్నాలజీయే ‘వైర్‌లెస్‌ చార్జింగ్‌ రూమ్‌’.

ఎలక్ట్రానిక్‌ పరికరాల చార్జింగ్‌ కోసం వైర్లు, కేబుళ్లు, చార్జర్లు, పోర్టుల అవసరం లేకుండా.. ఒక గదిలో వాటికవే బ్యాటరీలో పవర్‌ను నింపుకునే విధానాన్ని పరిశోధకులు రూపొందించారు. ‘వైర్‌లెస్‌ చార్జింగ్‌ రూమ్‌’ విధానం పేరుతో ఈ టెక్నాలజీని అభివృద్ధిని చేశారు. 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ చార్జింగ్‌ రూమ్‌లో గాలి ద్వారానే విద్యుదయస్కాంత శక్తి ప్రసారం అవుతుంది. దాన్నే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు చార్జింగ్‌గా నింపుకొంటాయి.

స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, ఆడియో సిస్టమ్‌లు, టేబుల్‌ ల్యాంప్స్‌, టేబుల్‌ ఫ్యాన్లు, ఆక్సీ మీటర్లతో పాటు హార్ట్‌ ఇంప్లాంట్లు అమర్చుకున్న వారికి కూడా ఈ గది పవర్‌ను సరఫరా చేయగలదు.

గోడలకు అమర్చే ప్రత్యేక కెపాసిటర్‌ వ్యవస్థ:

గది గోడలకు అమర్చే ప్రత్యేక కెపాసిటర్‌ వ్యవస్థ ‘వైర్‌లెస్‌ చార్జింగ్‌ రూమ్‌’లో కీలక పాత్ర పోషిస్తాయి. లంప్‌డ్‌ కెపాసిటర్లుగా పిలిచే ఇవి థర్మల్‌ సిస్టమ్స్‌గా పనిచేస్తాయి. ఈ కెపాసిటర్‌ వ్యవస్థ విద్యుదయస్కాంత శక్తిని ప్రసారం చేస్తుంది. దీనికోసం వాటిలో ప్రత్యేక కాయిల్స్‌ ఉంటాయి. ఈ కాయిల్స్‌ సాయంతో విద్యుదయస్కాంత తరంగాలు విడుదల అవుతాయి. ఇదే సమయంలో ప్రసరించే విద్యుత్‌శక్తిని కెపాసిటర్లు గ్రహిస్తాయి. మరోవైపు, విద్యుదయస్కాంత తరంగాలు నలుమూలల్లోకి ప్రసరించేలా గది మధ్యభాగంలో ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి పరిశోధకులు కెపాసిటర్‌ వ్యవస్థను అమర్చారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉండే వైర్‌ కాయిల్స్‌ ఈ తరంగాలను గ్రహించి చార్జింగ్‌ అవుతాయి. వైర్‌లెస్‌ చార్జింగ్‌ రూమ్‌ రేంజ్‌ 10 అడుగుల వరకు ఉంటుంది.

మనుషులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

ఈ చార్జింగ్‌ టెక్నాలజీ ద్వారా మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం.. వైర్‌లెస్‌ చార్జింగ్‌ రూమ్‌ను తయారు చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. చార్జింగ్‌ కోసం ఈ వ్యవస్థ గరిష్ఠంగా 50 వాట్ల పవర్‌ను మాత్రమే విడుదల చేస్తుందని, మనుషులకు షాక్‌ కలిగించే విద్యుత్తును కెపాసిటర్‌ ముందుగానే గ్రహిస్తుందని, దీంతో కరెంట్‌ షాక్‌ సమస్య ఉండదని వివరించారు. గరిష్ఠంగా ఐదు ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఒకేసారి చార్జింగ్‌ పెట్టుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలో ఉందని, ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సామాన్యుడికి టెక్నాలజీ అందాలంటే మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది.. తమ పరిశోధనల ద్వారా టెక్నాలజీని త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని అన్నారు.

ఇవీ కూడా చదవండి:

Solar Storm: అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌.. భూమికి పొంచివున్న ముప్పు.. ఆందోళన కలిగిస్తున్న శాస్త్రవేత్తల రిపోర్టు

RBI Penalty: మరో రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా.. కస్టమర్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా..?