Manesh Mahatme : అమెజాన్ మాజీ ఎగ్జిక్యూటివ్ మనీష్ మహాత్మేను భారతదేశ హెడ్ ఆఫ్ పేమెంట్స్ బిజినెస్ డైరెక్టర్ గా వాట్సాప్ నియమించింది. భారతదేశంలో వాట్సాప్ డిజిటల్, ఆర్థిక దృష్టిని ప్రోత్సహించడానికి మనీశ్ కృషి చేస్తారని ఒక ప్రకటనలో తెలిపింది. మనేష్‌కు డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిటీబ్యాంక్, ఎయిర్‌టెల్ మనీ, అమెజాన్ వంటి చెల్లింపుల్లో 17 సంవత్సరాల అనుభవం ఉంది. అమెజాన్ తర్వాత మానేష్ వాట్సాప్‌లో చేరారు. అమెజాన్ పే ఇండియాలో డైరెక్టర్‌గా, బోర్డు సభ్యుడిగా 7 సంవత్సరాలు గడిపాడు. ఈ సమయంలో అతను ఉత్పత్తి, ఇంజనీరింగ్, వృద్ధి బృందాలకు నాయకత్వం వహించాడు. వాట్సాప్ ఇండియా అధినేత అభిజిత్ బోస్ మాట్లాడుతూ మనేష్ వాట్సాప్‌లోకి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వృద్ధికి మనేష్ కీలకమైన ఆవిష్కర్త అన్నారు. వాట్సాప్‌కు చెల్లింపులు, అమ్మకాలను ప్రోత్సహించడానికి వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటాం అన్నారు. అన్ని వర్గాల ప్రజలను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి వాట్సాప్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. 2018 లో ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థ భారతదేశంలో తన యుపిఐ ఆధారిత చెల్లింపు సేవను పరీక్షించడం ప్రారంభించింది. ఇది వినియోగదారులకు డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఆమోదం కోసం ఎదురుచూస్తున్నందున సుమారు 10 మిలియన్ల వినియోగదారులకు మాత్రమే పరిమితం చేశారు.
గత ఏడాది నవంబర్‌లో వాట్సాప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) నుంచి దేశంలో తన చెల్లింపుల సేవను ప్రారంభించడానికి ఆమోదం పొందింది. భారతదేశంలో వాట్సాప్ నేరుగా పేటిఎమ్, గూగుల్ పే, వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే, అమెజాన్ పే వంటి కంపెనీలతో పోటీపడుతుంది. గణాంకాల ప్రకారం భారతదేశంలో 53 కోట్ల వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. భారతదేశం అంతటా వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉందని మహాత్మే అన్నారు. ఇందులో భాగస్వామిని అవుతున్నందున చాలా సంతోషంగా ఉందన్నారు.