Jio: జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో నిలిచిన ఏకైక ఇండియన్ కంపెనీగా రికార్డ్..

భారతీయ టెలికాం రంగ రూపురేఖలను మార్చేసిన రిలయన్స్ జియో.. ఇప్పుడు అంతర్జాతీయ సాంకేతిక వేదికపై దేశం గర్వపడేలా సరికొత్త చరిత్ర సృష్టించింది.అంతర్జాతీయ WIPO ర్యాంకింగ్స్‌లో ఏకంగా 320 స్థానాలు జంప్ చేసి.. గ్లోబల్ టాప్-20లో నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ కంపెనీగా జియో రికార్డులకెక్కింది.

Jio: జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో నిలిచిన ఏకైక ఇండియన్ కంపెనీగా రికార్డ్..
Jio Platform Wipo Patents Ranking

Updated on: Jun 14, 2026 | 8:36 PM

భారతీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు అంతర్జాతీయ సాంకేతిక వేదికపై ఏకైక భారతీయ కంపెనీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ ప్రపంచంలోనే టాప్ 20 స్థానాల్లో నిలిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ టెక్నాలజీ కంపెనీగా జియో రికార్డులకెక్కింది. ముంబై వేదికగా జరిగిన అధికారిక ప్రకటనలో.. గ్లోబల్ టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, శామ్‌సంగ్, క్వాల్‌కామ్, నోకియా, హువాయ్ వంటి ఎలైట్ క్లబ్ సరసన జియో చేరినట్లు సంస్థ వెల్లడించింది.

ఏకంగా 320 స్థానాలు జంప్..

గతేడాదితో పోలిస్తే జియో ప్లాట్‌ఫార్మ్స్ ఏకంగా 320 స్థానాలను దాటుకుంటూ గ్లోబల్ టాప్-20 లోకి దూసుకురావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్స్ వృద్ధి రేటు కేవలం 1శాతం కంటే తక్కువగా నమోదైన ఈ తరుణంలో జియో ఈ రేంజ్‌లో దూసుకెళ్లడం అంతర్జాతీయ టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. జియో కేవలం టెక్నాలజీని వాడుకునే కంపెనీ మాత్రమే కాదని, ప్రపంచానికి సరికొత్త టెక్నాలజీని సృష్టించి ఇచ్చే స్థాయికి ఎదిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.

జియో పేటెంట్లలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలు ఇవే..

జియో తన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఎక్కువగా భవిష్యత్తును శాసించే సరికొత్త టెక్నాలజీలపైనే దృష్టి పెట్టింది. వాటిలో ముఖ్యమైనవి

  • 5G Advanced, 6G నెట్‌వర్క్స్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) & AI-నేటివ్ నెట్‌వర్క్‌లు
  • ఏజెంటిక్ ఏఐలో సరికొత్త ఆవిష్కరణ – జియో బ్రెయిన్
  • శాటిలైట్ కమ్యూనికేషన్స్
  • క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫార్మ్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, నెట్‌వర్క్ స్లైసింగ్

ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు అంకితం: ఆకాష్ అంబానీ

ఈ చారిత్రాత్మక విజయంపై జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘WIPO గ్లోబల్ టాప్ 20 ర్యాంకింగ్స్‌లోకి జియో చేరడం అనేది.. మేం డీప్ టెక్ కంపెనీగా మారడానికి ఇన్నేళ్లుగా పడిన కష్టానికి దక్కిన గుర్తింపు. జియోలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఇది నిరూపిస్తోంది. ఈ అద్భుతమైన మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు అంకితం ఇస్తున్నాం. భారత్ కేవలం సాంకేతికతను దిగుమతి చేసుకోవడమే కాదు.. ప్రపంచానికి టెక్నాలజీని సృష్టించే, ఎగుమతి చేసే గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న ప్రధాని కల సాకారంలో జియో భాగస్వామి కావడం మాకు గర్వకారణం’’ అని అన్నారు.

జియో పేటెంట్ల లెక్కలు

జియో విడుదల చేసిన నివేదిక ప్రకారం మార్చి 31, 2026 నాటికి ఉన్న గణాంకాలు ఇలా ఉన్నాయి.

  • మొత్తం ఫైల్ చేసిన పేటెంట్లు:6,817
  • భారత్‌లో ఫైల్ చేసినవి: 2,393 పేటెంట్లు
  • విదేశీ మార్కెట్లలో ఫైల్ చేసినవి: 4,424 పేటెంట్లు
  • ఇప్పటివరకు ఆమోదం పొందినవి: గ్లోబల్‌గా 1,009 పేటెంట్లు (భారత్‌లో 538, అంతర్జాతీయంగా 471).

కేవలం 1.4 బిలియన్ల భారతీయులకు చౌకగా డేటా అందించడమే కాకుండా.. 4G LTE, 5G నెట్‌వర్క్‌లను పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన జియో, ఇప్పుడు 6G దిశగా అడుగులు వేస్తోంది. జియో సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు.. ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో భారతదేశపు బ్రాండ్ వాల్యూను మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.

Follow Us