మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోనా? ఈ ఒక్క పని చేయండి చాలు!

స్మార్ట్ ఫోన్ వాడుతున్న చాలా మంది తరచూ తమ ఫోన్లకు సిగ్నల్స్ అందక ఇబ్బంది పడుతుంటారు. ఇందుకు కారణం సెల్ టవర్ నుంచి సరిగా సిగ్నల్స్ అందడం లేదని అనుకుంటున్నారు. అయితే, దీనికి తమ ఫోన్లకు రక్షణ కవచాలుగా ఉపయోగించే కవర్ లేదా పౌచ్‌లు కారణమని చాలా మందికి తెలియకపోవచ్చు. ఫోన్ లోపల ఉండే కనిపించని యాంటెన్నాకు సెల్ టవర్ల నుంచి సిగ్నల్స్ అందకుండా ఈ కవర్లు అడ్డుకోవడం వల్లే ఆయా ఫోన్లలో ఇంటర్నెట్ స్లో అవుతుంది. తరచూ కాల్స్ కట్ అవుతూ ఉంటాయి.

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోనా? ఈ ఒక్క పని చేయండి చాలు!
Smartphones

Updated on: Dec 31, 2025 | 5:26 PM

బెస్ట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ల కోసం వేల రూపాయలు వెచ్చించే చాలా మంది వాటికి నాణ్యమైన పౌచ్ లేదా కవర్లను వేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటారు. చౌకైన లేదా షో కోసం తీర్చిదిద్దిన బ్యాక్ కేసులను ఉపయోగించడం వల్ల ఆ ఫోన్ల పనితీరు నెమ్మదిస్తుందని చాలా మందికి తెలియదు. ఇలాంటి పౌచ్‌లు, బ్యాక్ కేసుల కారణంగా ఫోన్లకు పూర్తిస్థాయిలో సిగ్నల్ అందకపోవచ్చు. దీంతో ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంది. ఫోన్లలో ఎలాంటి లోపం లేకపోయినప్పటికీ ఆయా బ్రాండ్ల ఫోన్లు వాడటం వల్లే నెట్ స్లోగా ఉందని, సెల్ నెట్‌వర్క్ సరిగా లేదని అనుకుంటారు.

కనిపించని యాంటెన్నాకు సిగ్నల్ కట్

ప్రతి మొబైల్ ఫోన్ లోపల సిగ్నల్ అందుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన ‘యాంటెన్నా’ ఉంటుంది. ఇవి గాలిలోని రేడియో తరంగాల ద్వారా టవర్‌తో అనుసంధానం కలిగి ఉంటాయి. అయితే, మనం ఉపయోగించే ఫోన్ కవర్లు లేదా పౌచ్‌లు యాంటెన్నాకు అడ్డుగా ఉండి.. పూర్తిస్థాయిలో సిగ్నల్స్ అందకుండా చేస్తాయి.

చాలా మంది మెటల్ లేదా మాగ్నటిక్ కేసులను ఉపయోగిస్తున్నారు. ఇవి అందంగా కనిపించినప్పటికీ.. పోన్‌కు సిగ్నల్స్ అందకుండా చేస్తాయి. ఫ్రీక్వెన్సీని బ్లాక్ చేస్తాయి. మీ ఫోన్ పూర్తి సిగ్నల్ పొందకుండా నిరోధిస్తాయి. మరికొంతమంది తమ ఫోన్లు కింద పడిపోతే పగిలిపోకుండా కాపాడుకోవడానికి చాలా మందమైన ప్లాస్టిక్ లేదా రబర్ కేసులను ఉపయోగిస్తారు. మీరు పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, సెల్ ఫోన్ టవర్‌కు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో, సిగ్నల్ బలహీనంగా ఉన్న లిఫ్ట్‌లు, బేస్మెంట్లలో ఉన్నప్పుడు మాత్రం ఈ మందపాటి కేసులు.. ఫోన్లకు టవర్ల నుంచి సిగ్నల్స్‌ను పూర్తిస్థాయిలో అందనీయకుండా చేస్తాయి. మరోవైపు, రేడియేషన్ కంట్రోలింగ్ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. రేడియేషన్స్ తోపాటు ఇవి ఫోన్ కు అవసరమైన సిగ్నల్స్‌ను కూడా అందకుండా చేస్తాయి.

బ్యాటరీకి చేటే

ఫోన్‌లకు నాణ్యమైన కవర్లు లేదా పౌచ్‌లను ఉపయోగించకుండా తక్కువ ధరకు వచ్చే నాణ్యత లేనివి ఉపయోగంచడం వల్ల సిగ్నల్స్ ప్రభావితం కావడంతోపాటు సెల్ బ్యాటరీ కూడా దెబ్బతింటుంది. సిగ్నల్ సరిగ్గా అందకపోతే బ్యాటరీ ఎక్కువగా పనిచేసి వేడెక్కే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాటరీ తొందరగా ఛార్జింగ్ కోల్పోతుంది. అందుకే నాణ్యమైన సిలికాన్ లేదా మృదువైన ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడం ఉత్తమం. ఇంకా చెప్పాలంటే ఆయా సెల్ ఫోన్ కంపెనీలు అందించే కవర్లు లేదా పౌచ్‌లను ఉపయోగించడం వల్ల సిగ్నల్ తోపాటు బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఇంటర్నెట్ తోపాటు కాల్స్ సిగ్నల్ బాగుంటాయి.