
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు డీజిల్ వాహనాలదే ఆధిపత్యం. ముఖ్యంగా 2012-13 కాలంలో ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో డీజిల్ వాటా దాదాపు 47 శాతానికి చేరుకుంది. అయితే కఠినమైన కాలుష్య నియంత్రణలు, పెట్రోల్-సీఎన్‌జీ వాహనాల పెరుగుతున్న ఆదరణ, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో ఇప్పుడు ఆ వాటా సుమారు 18 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ SUVలు, ఆఫ్-రోడింగ్ వాహనాలు, సుదూర ప్రయాణాల కోసం డీజిల్‌పై ఆధారపడే వినియోగదారుల వల్ల ఈ ఇంధనం ఇంకా పూర్తిగా కనుమరుగుకాలేదు.
ప్రస్తుతం డీజిల్ వాహనాల డిమాండ్ ఎక్కువగా పెద్ద SUVలకే పరిమితమవుతోంది. వినియోగదారులు ఇంధన ఖర్చు కంటే టార్క్, హైవే మైలేజ్, లాంగ్ డ్రైవ్ సామర్థ్యాన్ని ముఖ్యంగా పరిగణిస్తున్నారు. అందుకే మహీంద్రా వంటి కంపెనీలు స్కార్పియో, థార్, బొలెరో వంటి డీజిల్ SUVల ద్వారా మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. చిన్న డీజిల్ కార్ల అభివృద్ధి ఇక లాభదాయకం కాకపోవడంతో, అనేక కంపెనీలు ఆ విభాగం నుంచి బయటకు వస్తున్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మాత్రం డీజిల్‌తో పాటు EVలు, పెట్రోల్, ఇతర పవర్‌ట్రెయిన్‌లలో కూడా పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈఓ నలినీకాంత్ గొల్లగుంట ప్రకారం, వినియోగదారుల అవసరాలు భిన్నంగా ఉండటంతో అన్ని రకాల పవర్‌ట్రెయిన్‌లలో ఆవిష్కరణలు కొనసాగిస్తామని చెప్పారు. లగ్జరీ మార్కెట్‌లో కూడా డీజిల్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మెర్సిడిస్ బెంజ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల త్రైమాసిక అమ్మకాలలో 50 శాతానికి పైగా డీజిల్ మోడళ్ల నుంచే వచ్చాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ యాజమాన్య వ్యయం, మెరుగైన డ్రైవింగ్ అనుభవం, సుదూర ప్రయాణాల్లో సౌలభ్యం అని సంస్థ చెబుతోంది.
అయితే భవిష్యత్తులో BS7 ఉద్గార నిబంధనలు డీజిల్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ నిబంధనల కారణంగా ఒక్కో డీజిల్ వాహనం ధర రూ.30,000 నుంచి రూ.1 లక్షకు పైగా పెరగవచ్చు. ముఖ్యంగా రూ.10-20 లక్షల SUV విభాగంలో ఇది పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ధరలు భారీగా పెరిగితే వినియోగదారులు డీజిల్‌కే కట్టుబడి ఉంటారా? లేక CNG, హైబ్రిడ్, లేదా EVల వైపు మళ్లుతారా? అన్నదే ఇప్పుడు ఆటో రంగంలో ప్రధాన చర్చగా మారింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి