సరికొత్త డిజైన్‌, అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన హుందాయ్‌ వెర్నా! ధర ఎంతంటే?

హ్యుందాయ్ తన 2026 వెర్నా మిడ్-సైకిల్ అప్‌డేట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ. 10.98 లక్షలు. కొత్త బ్లాక్ క్రోమ్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, అధునాతన 16 అంగుళాల అలాయ్ వీల్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వాక్-ఇన్ ఫీచర్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS వంటి భద్రతా ఫీచర్లు ఈ మోడల్‌లో ఉన్నాయి.

సరికొత్త డిజైన్‌, అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన హుందాయ్‌ వెర్నా! ధర ఎంతంటే?
Hyundai Verna 2026

Updated on: Mar 09, 2026 | 9:53 PM

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హుందాయ్‌ తన ప్రముఖ సెడాన్ వెర్నా 2026 మిడ్-సైకిల్ అప్‌డేట్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ.10.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో తన స్థానాన్ని బలపరచుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఈ విభాగంలో వెర్నా ప్రధానంగా వోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ వంటి మోడళ్లతో పోటీ పడుతోంది.

డిజైన్‌లో మార్పులు

2026 వెర్నా బయటికి వైపు అనేక మార్పులు చేసింది. కొత్త బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్లు కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు బోనెట్ అంతా విస్తరించే కొత్త LED లైట్ బార్ కూడా జోడించారు. అదనంగా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇవ్వగా, కొత్తగా ‘క్లాసీ బ్లూ’, ‘టైటాన్ గ్రే మ్యాట్’ వంటి రంగులను కూడా కలర్ ఆప్షన్లలో చేర్చారు.

ఇంటీరియర్, టెక్నాలజీ

కారు లోపల డ్రైవర్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు ఫీచర్లు జోడించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాక్-ఇన్ ఫీచర్ సెగ్మెంట్‌లో మొదటిసారి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వెనుక సీట్లో ఉన్న ప్రయాణికులు ముందు సీటును ఎలక్ట్రానిక్‌గా సర్దుకోవచ్చు. డ్రైవర్ కోసం మెమరీ ఫంక్షన్‌తో 8-వే పవర్ అడ్జస్టబుల్ సీటు, ‘వెల్కమ్ రిట్రాక్ట్’ ఫీచర్ కూడా ఉంది. డ్యాష్‌బోర్డ్‌లో డ్యూయల్ 10.25-అంగుళాల డిజిటల్ స్క్రీన్‌లు ఉండగా, మీడియా, క్లైమేట్ సెట్టింగ్స్ కోసం స్విచ్ చేయగల కంట్రోలర్‌ను కూడా జోడించారు.

2026 వెర్నాలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఇవ్వబడుతున్నాయి. ఇందులో సెంటర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్ కూడా ఉంది. అదనంగా లెవల్-2 ADAS టెక్నాలజీతో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సుమారు 20 స్మార్ట్ డ్రైవింగ్ ఫంక్షన్లు ఉన్నాయి. రియర్ వ్యూ మిర్రర్‌లో ఫ్యాక్టరీ-ఫిట్ డాష్‌క్యామ్ కూడా ఇవ్వబడింది.

కారు రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ MPi పెట్రోల్, 115 PS పవర్, 144 Nm టార్క్. 1.5 లీటర్ టర్బో GDi పెట్రోల్ 160 PS పవర్, 253 Nm టార్క్. ట్రాన్స్‌మిషన్‌గా 6-స్పీడ్ మాన్యువల్, IVT, 7-స్పీడ్ DCT ఎంపికలు ఉన్నాయి. కొత్త వెర్నా మొత్తం ఆరు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది: HX2, HX4, HX6, HX6+, HX8, HX10. ప్రారంభ ధర రూ.10.98 లక్షలు, టాప్ మోడల్ ధర రూ.18.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త డిజైన్, అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్‌తో 2026 వెర్నా మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో పోటీని మరింత పెంచనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us