మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు..

మీ ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? డబ్బా ఫోన్ అని దాన్ని పక్కన పడేశారా? అయితే కాస్త ఆగండి.. ఆ పాత ఫోనే ఇప్పుడు మీ ఇంటికి 24 గంటలూ కాపలా కాసే సెక్యూరిటీ గార్డ్‌లా మారబోతుంది. అవును, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కేవలం ఒక చిన్న ట్రిక్‌తో మీ పాత మొబైల్‌ను హై-క్వాలిటీ సీసీటీవీ కెమెరాగా మార్చేయవచ్చు.

మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
How To Use Old Smartphone As Security Camera

Updated on: Jun 17, 2026 | 7:59 PM

ప్రస్తుతం దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అరాచకాలు, నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లకు రక్షణ కల్పించుకోవడం అత్యంత అవసరంగా మారింది. ఇందుకోసం చాలామంది తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అందరికీ CCTV కెమెరాలు కొనేంత, వాటిని మెయింటైన్ చేసేంత ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. మరి తక్కువ బడ్జెట్‌లో ఇంటికి భద్రత కల్పించడం ఎలా?.. అందుకే ఒక సూపర్ టెక్ ట్రిక్ ఉంది. మీ ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. రూపాయి ఖర్చు లేకుండా దాన్ని సెక్యూరిటీ కెమెరాగా మార్చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒక వైఫై కనెక్షన్ మాత్రమే. పాత మొబైల్‌ను CCTVగా ఎలా మార్చాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పాత స్మార్ట్‌ఫోన్‌ను CCTVగా మార్చడానికి కావాల్సినవి..

  • కెమెరా బాగా పనిచేసే ఒక పాత స్మార్ట్‌ఫోన్.
  • లైవ్ వీడియోను పర్యవేక్షించడానికి మీరు ప్రస్తుతం వాడుతున్న మరొక స్మార్ట్‌ఫోన్.
  • ఇంట్లో మంచి వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్షన్.
  • మొబైల్ ఛార్జర్ మరియు కరెంట్ సప్లై.
  • ఫోన్‌ను ఒకేచోట స్థిరంగా ఉంచడానికి ఒక మొబైల్ స్టాండ్ లేదా మౌంట్.

ముఖ్య గమనిక: 24 గంటలూ లైవ్ వీడియో రికార్డింగ్ అవ్వడం వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి పాత ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచడం తప్పనిసరి.

ఏ యాప్ ఉపయోగించాలి? ఎలా సెటప్ చేయాలి?

పాత స్మార్ట్‌ఫోన్‌ను CCTVగా మార్చడానికి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ఆల్ఫ్రెడ్ కెమెరా. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ పనిచేస్తుంది.

సెటప్ చేసే విధానం

  • ముందుగా మీ పాత మొబైల్‌లో, మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌లో AlfredCamera’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • రెండు ఫోన్లలోనూ ఒకే గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత.. పాత ఫోన్ స్క్రీన్‌పై Camera ఆప్షన్‌ను, మీరు వాడుతున్న ఫోన్ స్క్రీన్‌పై Viewer ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
  • అంతే సింపుల్.. ఇప్పుడు పాత ఫోన్‌లో లైవ్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ దృశ్యాలను మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రస్తుత మొబైల్‌లో లైవ్‌గా చూసుకోవచ్చు.

ఫోన్‌ను ఎక్కడ అమర్చాలి?

CCTVగా మార్చిన పాత ఫోన్‌ను ఇంట్లోని ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, హాల్‌లో లేదా విలువైన వస్తువులు ఉన్న రూమ్‌లో అమర్చవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్నట్లయితే వారు ఉన్న గదిలో పెట్టడం మంచిది. ఫోన్‌ను కొంచెం ఎత్తైన ప్రదేశంలో అమర్చితే ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. అయితే ఫోన్‌పై నేరుగా ఎండ పడే చోట పెట్టకూడదు, దీనివల్ల ఫోన్ హీట్ ఎక్కి పాడైపోయే అవకాశం ఉంది.

సేఫ్టీ టిప్స్

  • మీ హోమ్ మేడ్ CCTV కెమెరా హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
  • మీ ఇంటి వైఫై కనెక్షన్‌కు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉంచండి.
  • యాప్‌లో తప్పనిసరిగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోండి.
  • ఆల్ఫ్రెడ్ కెమెరా యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.
  • మీ లాగిన్ వివరాలను (ID, Password) ఎవరితోనూ షేర్ చేయవద్దు.

రూపాయల ఖర్చు లేకుండా ఇంట్లోనే లభించే వస్తువులతో ఇలా స్మార్ట్‌గా ఆలోచిస్తే.. మీ ఇల్లు మరియు కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు.

Follow Us