మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వారి ప్రైవసీకి ఏ మాత్రం ప్రమాదం వాటిల్లకుండా అనేక ఫీచర్లను సైతం తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే క్రమంలో ఆ ఫీచర్లపై వినియోగదారులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘స్టే సేఫ్ విత్ వాట్సాప్’ అంటే వాట్సాప్ తో భద్రంగా ఉండండి అనే స్లోగన్ తో ప్రత్యేక క్యాంపెయిన్ ను రన్ చేస్తోంది. మూడు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగునుంది. ఈ కాలంలో వాట్సాప్ సేఫ్టీ ఫీచర్లపై వినియోగదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా ‘బ్లాక్ అండ్ రిపోర్ట్’, ‘టూ స్టెప్ వెరిఫికేషన్’, ‘ప్రైవసీ అండ్ గ్రూప్ సెట్టింగ్స్’ ఆప్షన్లపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనుంది. ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాలు మరియు ఖాతా ట్యాంపరింగ్ వంటి ప్రమాదాలను నివారించడానికి ఇది ప్రజలకు సహాయపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టూ స్టెప్ వెరిఫికేషన్.. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా వినియోగదారులు తమ ఖాతాలకు అదనపు భద్రతను జోడించినట్లు అవుతుంది. మీ వాట్సాప్ ఖాతాను రీసెట్ చేసేటప్పుడు, ధృవీకరించేటప్పుడు ఆరు అంకెల పిన్ అవసరం అవుతుంది. ఒక వేళ మీ సిమ్ కార్డ్ దొంగిలించబడినప్పుడు లేదా ఫోన్ ట్యాంపర్ చేయబడినప్పుడు ఇది సహాయకరంగా ఉంటుంది.
బ్లాక్ అండ్ రిపోర్ట్.. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు ఖాతాను ‘బ్లాక్ అండ్ రిపోర్ట్’ చేయడానికి సులభమైన మార్గాన్ని కూడా అందిస్తుంది. బ్లాక్ చేయబడిన పరిచయాలు లేదా నంబర్‌ల నుంచి మీకు కాల్ లేదా సందేశాలు రావు.
ప్రైవసీ సెట్టింగ్‌లు.. ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్, స్టేటస్ వంటి వాటిని ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు అనేది వినియోగదారులు నియంత్రించగలరు. ప్రతి ఒక్కరూ, కాంటాక్ట్స్ మాత్రమే, సెలెక్టెడ్ కాంటాక్ట్స్ లేదా ఎవరూ చూడకుండా కూడా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. మీరు మీ ఆన్‌లైన్ వివరాలను ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు చూడవచ్చు. ఎవరు చూడకూడదు వంటి వివరాలను చూడవచ్చు.
గ్రూప్ సెట్టింగ్స్.. వాట్సాప్ గ్రూపుల్లో ఎవరిని యాడ్ చేయవచ్చో కూడా వినియోగదారులు నిర్ణయించగలుగుతారు. తద్వారా మీ గోప్యత పెరుగుతుంది. మీరు సభ్యులుగా ఉండకూడదనుకునే సమూహాలకు మిమ్మల్ని జోడించకుండా నిరోధించవచ్చు. దీనితో పాటు, ఇప్పుడు వినియోగదారులు కూడా రహస్యంగా గ్రూప్ నుండి నిష్క్రమించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..