స్మార్ట్ వాచ్.. ప్రస్తుత యూత్ కు ట్రెండీ ఐటెం. కొంతకాలం క్రితం వరకూ స్మార్ట్ ఫోన్ ప్రభంజనంలో రిస్ట్ వాచ్ లు కాలగమనంలో కొట్టుకుపోయాయి. అయితే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న వాచ్ ల కంపెనీలు కూడా సరికొత్తగా స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. వాటిల్లో అధునాతన సాంకేతికతను వినియోగించి డిజిటల్ బాట పట్టించాయి. పల్స్ రేట్ , బ్లడ్ ప్రెజర్ రీడింగ్, కేలరీస్ బర్నింగ్ వంటి ఫీచర్లను అందించాయి. దీంతో యూత్ తమ మణికట్టుకు స్మార్ట్ వాచీలను తగిలించడం అలవాటుచేసుకుంది. ఇప్పుడు అదే ట్రెండీ ఐటెం అయిపోయింది. ఈ డిమాండ్ కు అనుగుణంగా కంపెనీలు కూడా అనేక రకాల మోడల్స్, అప్ గ్రేడెడ్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో సిటిజెన్ కంపెనీ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన తన కొత్త సీజెడ్ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. దీనిలో ఏకంగా అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా అందించిన సాంకేతికతను జోడించింది. దీనిని ద్వారా మనిషి అలసటను, చురుకుదనాన్ని గుర్తించవచ్చట. లాస్ వేగాస్ లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)లో ఈ వాచ్ ను ఆ కంపెనీ ప్రదర్శించింది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సిటిజెన్ కంపెనీ లాంచ్ చేసిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ వాచ్ లో సీజెడ్ స్మార్ట్ యూక్యూ(CZ Smart You Q) అప్లికేషన్ ను పొందుపరిచింది. ఈ వాచ్ కి సామర్థ్యం అంతా ఈ అప్లికేషన్ మీద ఆధారపడి ఉంది. దీనిని మణికట్టుకు ధరించిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఈ వాచ్ గుర్తిస్తుంది. ఆ వ్యక్తి అప్రమత్తత స్థాయి ఎలా ఉంది. అలసిపోయడా.. లేక యాక్టివ్ గా ఉన్నాడా అన్న అంశాలను తెలియపరుస్తుంది. ఒకవేళ అలసిపోయి ఉంటే తిరిగి ఎనర్జీని గేయిన్ చేసుకోమని అలర్ట్ చేస్తుంది. సూచనలు, సలహాలు అందిస్తుంది.
ఈ స్మార్ట్ వాచ్ లోని స్మార్ట్ యూక్యూ అప్లికేషన్ ద్వారా అది ధరించిన వ్యక్తికి తన ఆరోగ్యంపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక అలర్ట్ మోనిటర్ ఉంటుంది. ఇది ప్రతి రోజూ ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సూచనలు అందిస్తుంది. ఈ వ్యవస్థ వ్యోమగాముల మానసిక స్థితిని తెలుసుకునేందుకు నాసా వినియోగించే సైకోమోటార్ విజిలన్స్ టాస్క్ టెస్ట్((PVT+) సంబంధించిన మోడల్.
ఈ సందర్భంగా అమెరికాకు చెందిన సిటిజెన్ వాచ్ కంపెనీ ప్రెసిడెంట్ జెఫ్రీ కొహెన్ మాట్లాడుతూ తమ లేటెస్ట్ సీజెడ్ స్మార్ట్ వాచ్ ను ఒక గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు. ఇది నాసా, ఐబీఎం పరిశోధకుల బెస్ట్ ఇన్ క్లాస్ వెర్షన్ అని చెప్పారు.
ఈ సీజెడ్ స్మార్ట్ యూక్యూ వాచ్ ఈ ఏడాది మార్చి నుంచి అమెరికా మార్కెట్ లో అందుబాటులో ఉండనుంది. దీని ప్రారంభ ధర 350 డాలర్లు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..