
ప్రస్తుతం కారులో వెళ్లాలంటే ఏసీ తప్పనిసరిగా మారింది. కొద్దిసేపు లేకున్న జనం ఉండలేని స్థితికి వచ్చేశారు. అయితే కారులో ఏసీ ఆన్ చేసినా కూడా కేబిన్ త్వరగా చల్లబడటం లేదని చాలా మంది అంటుంటారు. అంతేకాదు ఏసీ వల్ల మైలేజ్ పడిపోతుందనే ఆందోళన కూడా ఉంటుంది. కానీ మీ కారు డ్యాష్‌బోర్డ్‌పై ఉండే ఒకే ఒక్క చిన్న బటన్ మీ ఈ రెండు సమస్యలకూ చెక్ పెట్టగలదని మీకు తెలుసా? అవును.. కారు డ్యాష్‌బోర్డ్‌పై కారు గుర్తు ఉండి, దాని లోపల యూ టర్న్ తీసుకుంటున్నట్టు ఉండే ఒక బాణం గుర్తు కనిపిస్తుంది. దీనినే ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్ అంటారు. ఈ బటన్‌ను సరిగ్గా ఉపయోగించడం ద్వారా కారు క్షణాల్లో చల్లబడటమే కాకుండా పెట్రోల్, డీజిల్ కూడా ఆదా అవుతుంది.
సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడు అది ఫ్రెష్ ఎయిర్ మోడ్‌లో ఉంటుంది. అంటే కారు బయట ఉన్న వేడి గాలిని లోపలికి లాక్కొని, దానిని చల్లబరిచి కారు కేబిన్‌లోకి పంపుతుంది. బయట ఉష్ణోగ్రత 35 నుండి 40 డిగ్రీలు ఉన్నప్పుడు, ఏసీ నిరంతరం అంత వేడి గాలిని చల్లబరచాల్సి వస్తుంది. దీనివల్ల కారు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ మీరు ఎప్పుడైతే ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్ ఆన్ చేస్తారో.. అప్పుడు ఏసీ సిస్టమ్ బయటి గాలిని లోపలికి రాకుండా బ్లాక్ చేస్తుంది. దీనికి బదులుగా, కారు లోపల అప్పటికే ఉన్న గాలినే మళ్లీ మళ్లీ ఏసీ సిస్టమ్ ద్వారా ఫిల్టర్ చేసి, మరింత చల్లగా మార్చి లోపలికి పంపుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏసీ సిస్టమ్ అనేది నేరుగా చల్లటి గాలిని తయారు చేయదు, లోపల ఉన్న గాలిలోని వేడిని బయటకు లాగేస్తుంది. ఉదాహరణకు.. బయట 35 డిగ్రీల వేడి ఉండి, కారు లోపల ఏసీ నడవడం వల్ల టెంపరేచర్ 25 డిగ్రీలకు పడిపోయిందనుకుందాం. ఇప్పుడు రీసర్క్యులేషన్ మోడ్ ఆన్‌లో ఉంటే ఏసీ సిస్టమ్ ఆ 25 డిగ్రీల చల్లటి గాలినే తీసుకుని మరింత చల్లగా మారుస్తుంది. ఇలా ఇప్పటికే చల్లబడిన గాలినే మళ్లీ మళ్లీ కూల్ చేయడం వల్ల కారు కేబిన్ చాలా వేగంగా చిల్ అయిపోతుంది.
కారు ఏసీ కంప్రెషర్ అనేది ఇంజన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఏసీ ఎక్కువ కష్టపడితే ఇంజన్‌పై భారం పడి మైలేజ్ తగ్గుతుంది.
ఫ్రెష్ ఎయిర్ మోడ్‌లో: నిరంతరం బయటి వేడి గాలిని చల్లబరచడం కోసం కంప్రెషర్ నిరంతరాయంగా ఎక్కువ పవర్ ఉపయోగించాల్సి వస్తుంది.
రీసర్క్యులేషన్ మోడ్‌లో: లోపలి చల్లటి గాలినే రీసైకిల్ చేయడం వల్ల ఏసీ కంప్రెషర్‌కు పని భారం తగ్గుతుంది.
ముఖ్యంగా ఆధునిక కార్లలో ఉండే వేరియబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ కంప్రెషర్లు లోపల టెంపరేచర్ తగ్గగానే ఆటోమేటిక్‌గా తక్కువ ఎనర్జీని తీసుకుంటాయి. దీనివల్ల ఇంజన్‌పై లోడ్ తగ్గి, ఇంధనం ఆదా అవుతుంది. రోజువారీ ప్రయాణాల్లో ఇది పెద్దగా తెలియకపోయినా, ఈ వేసవి కాలం మొత్తం ఇలా వాడితే మీ జేబుకు చాలా డబ్బు ఆదా అవుతుంది.
కార్ నిపుణుల ప్రకారం.. ఎండలో పార్క్ చేసిన కారు ఎక్కిన వెంటనే మొదట ఈ రీసర్క్యులేషన్ మోడ్‌ను ఆన్ చేసుకోవాలి. అలాగే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దీనిని ఆన్ చేయడం వల్ల బయట ఉండే ధూళి, పొగ, కాలుష్యం కారు లోపలికి రాకుండా ఉంటాయి. అయితే ఈ మోడ్‌ను గంటల తరబడి నిరంతరాయంగా ఆన్ చేసి ఉంచకూడదు. కారులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నప్పుడు, లాంగ్ జర్నీలలో చాలా సేపు ఒకే గాలి లోపల తిరగడం వల్ల కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయాణికులకు అలసట, నీరసం లేదా తలపోటు రావచ్చు. అందుకే ప్రతి 20 నుండి 30 నిమిషాలకు ఒకసారి కేవలం రెండు నిమిషాల పాటు ఫ్రెష్ ఎయిర్ మోడ్ ఆన్ చేసి, మళ్లీ రీసర్క్యులేషన్ మోడ్‌లోకి మార్చుకోవడం ఉత్తమం.
ప్రశ్న: రీసర్క్యులేషన్ మోడ్ వల్ల కార్ ఏసీ కూలింగ్ ఎందుకు వేగంగా పెరుగుతుంది?
సమాధానం: రీసర్క్యులేషన్ మోడ్ ఆన్ చేస్తే, కారు లోపల అప్పటికే కొద్దిగా చల్లబడిన గాలినే ఏసీ మళ్లీ మళ్లీ కూల్ చేస్తుంది. దీనివల్ల ఏసీపై భారం తగ్గి కేబిన్ చాలా వేగంగా చల్లబడుతుంది.
ప్రశ్న: కారు ఏసీలో ఈ బటన్ నొక్కడం వల్ల నిజంగానే మైలేజ్ పెరుగుతుందా?
సమాధానం: అవును, పెరుగుతుంది. రీసర్క్యులేషన్ మోడ్‌లో ఏసీ కంప్రెషర్‌కు పని భారం తగ్గుతుంది. దీనివల్ల ఇంజన్‌పై లోడ్ తగ్గి, ఇంధనం ఆదా అవుతుంది.
ప్రశ్న: ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఏ మోడ్ ఉపయోగించడం మంచిది?
సమాధానం: భారీ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్ లోనే ఉంచాలి. దీనివల్ల బయట ట్రాఫిక్‌లో ఉండే వాహనాల పొగ, ధూళి కారు లోపలికి రాకుండా ఉంటాయి.