సంతానలేమి.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ సమస్య సర్వసాధారణంగా మారింది. ఒకప్పుడు సంతానలేమి సమస్య అంటే కేవలం మహిళలకు మాత్రమే పరిమితమనే అపోహ ఉండేది కానీ ప్రస్తుతం మగవారిలోనూ ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మారుతోన్న జీవన విధానం, వర్క్ కల్చర్, తీసుకునే ఆహారంలో మార్పులు కారణం ఏదైనా మగవారిలో కూడా సంతానలేమి సమస్య వేధిస్తోంది. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 శాతం పురుషులు సంతానలేమితో బాధపడుతున్నట్లు తేలింది.
మగవారిలో సంతానలేమి సమస్యలో వీర్యకణాల సంఖ్య ప్రధాన సమస్యగా మారుతోంది. స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్లే మగవారిలో సంతానలేమి ఎక్కువవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు స్పెర్మ్ కౌంట్‌ను లెక్కించడానికి ఎన్నో రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా వీర్య కణాల సంఖ్యను లెక్కించేందుకు పరిశోధకులు టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నారు. స్పెర్మ్ కౌంట్ సమస్యను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమేథ) పరిష్కారం చూపుతుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బయో మెడికల్ ఇంజనీరింగ్ పరిశోధకుడు డాక్టర్ స్టీవెన్ వసిలెస్క్యూ తెలిపారు.
సంతానలేమితో బాధపడుతోన్న పురుషుల వీర్య కణాలను గుర్తించేందుకు గాను పరిశోధకుల బృందం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని అభివద్ధి చేశారు. దీంతో నిపుణులైన డాక్టర్లకన్నా వెయ్యి రెట్ల వేగంతో శుక్రకణాలను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పరిశోధకులు డెవలప్ చేసిన ఈ కొత్త రకం సాఫ్ట్‌వేర్‌కు పరిశోధకులు ‘స్పెర్మ్ సెర్చ్’ అనే పెట్టారు. సాధారణ పద్ధతుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వారి నుంచి శుక్ర కణాలను సేకరించి అందులో ఆరోగ్యకరమైన శుక్ర కణాన్ని అండంలో ప్రవేశపెడతారు.
ఈ విధానానికి ఎంత కాదన్నా 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. కానీ పరిశోధకులు తీసుకొచ్చిన కొత్త ఏఐ విధానం ద్వారా స్పెర్మ్ శాంపిల్ ఫొటోను సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయగానే సెకన్ల వ్యవధిలో ఆరోగ్యకరమైన శుక్ర కణాన్ని సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. దీంతో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ మరింత సులభంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ విధానం ఇంకా టెస్టింట్ స్టేజ్ లోనే ఉందని. మరిన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాత సాఫ్ట్ వేర్ ను విడుదల చేయనున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వైద్య రంగంలో శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..