Apple Smartwatch: యాపిల్ స్మార్ట్‌ వాచ్‌తో మహిళకు పునర్జన్మ.. టెక్నాలజీయే ప్రాణాలు పోసింది! పూర్తి వివరాలు ఇవి..

|

May 11, 2023 | 3:42 PM

మార్కెట్లో అనేక రకాల ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పలు రకలా హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. ఇవి మనిషి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడమే కాక.. వాటిని ధరించిన వ్యక్తి ఆరోగ్యంలో అకస్మాత్తుగా ఏదైనా తేడా వస్తే.. అలర్ట్ చేయడంతో పాటు ఆ వ్యక్తి స్నేహితులకు, అత్యవసర సేవల సిబ్బందికి సమాచారాన్ని చేరవేస్తున్నాయి.

Apple Smartwatch: యాపిల్ స్మార్ట్‌ వాచ్‌తో మహిళకు పునర్జన్మ.. టెక్నాలజీయే ప్రాణాలు పోసింది! పూర్తి వివరాలు ఇవి..
Apple Watch
Follow us on

ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంలో ఉన్నాం. చేతిలో వాచ్ నుంచి మణికట్టుకు ఉండే వాచ్, ఆఫీసుల్లో వినియోగించే ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్, ఇళ్లల్లో ఉండే టీవీలు అంతా స్మార్టే. అందుబాటులోకి వస్తున్న ఈ ఆధునిక సాంకేతికత మనిషి పనిని సులభతరం చేయడంతో పాటు వేగంగా పూర్తి చేయడానికి సాయపడుతోంది. అయితే ఆ సాంకేతికతను సరైన విధంగా వినియోగించాలి. ఇష్టానుసారం వినియోగిస్తే ప్రమాదాల బారిన పడటం ఖాయం. అయితే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు మనిషి ఆరోగ్యాన్ని కూడా ట్రాక్ చేస్తున్నాయి. మనం రోజూ ధరించే కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అయితే మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తాయి. వాటిల్లో ప్రధానమైనది స్మార్ట్ వాచ్.

మార్కెట్లో అనేక రకాల ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పలు రకలా హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. ఇవి మనిషి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడమే కాక.. వాటిని ధరించిన వ్యక్తి ఆరోగ్యంలో అకస్మాత్తుగా ఏదైనా తేడా వస్తే.. అలర్ట్ చేయడంతో పాటు ఆ వ్యక్తి స్నేహితులకు, అత్యవసర సేవల సిబ్బందికి సమాచారాన్ని చేరవేస్తున్నాయి. వాటిల్లో యాపిల్ సంస్థకు చెందిన స్మార్ట్ వాచ్ లు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో వ్యక్తుల ప్రాణాలను యాపిల్ స్మార్ట్ వాచ్ లు కాపాడినట్లుగా పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు ఇది నిజంగా జరిగింది. యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ ధరించిన ఓ మహిళ హోటల్‌ గదిలో కుప్పకూలిపోయింది. దీనిని గ్రహించిన స్మార్ట్‌ వాచ్‌లోని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించింది. వెంటనే వారు వచ్చి ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. ఇదెలా సాధ్యమైంది? దీనికి సంబంధించిన ఆ మహిళ కూతురు చెబుతున్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్మార్ట్ వాచ్ ఎలా ఉపయోగపడిందంటే..

యాపిల్ స్మార్ట్ వాచ్ ను ధరించిన ఆ మహిళకు దానిలోని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఏ విధంగా ఉపయోగపడిందో ఆ మహిళ కుమార్తె ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన రెడ్డిట్(Reddit)లో పోస్ట్ చేశారు. తన తల్లి ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్ పనితీరుని అభినందిస్తూ ఆమ ఈ విధంగా పోస్ట్ చేశారు..

ఇవి కూడా చదవండి

‘మా అమ్మ ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌కు బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడకు సమీపంలోనే ఓ హోటల్‌లో దిగారు. ఆ సమయంలో ఆమెకు ఛాతిలో నొప్పి ప్రారంభమైంది. వెంటనే తన ఫ్రెండ్‌ను హోటల్‌కు రమ్మని మెసేజ్‌ పంపారు. ఫ్రెండ్‌ హాటల్‌కు వచ్చేసరికే అమ్మ కిందపడిపోయి ఉన్నారు. కంగారు పడిన అమ్మ ఫ్రెండ్‌ హాస్పిటల్‌ అంబులెన్స్‌కు కాల్‌ చేశారు. అయితే అప్పటికే సమాచారం అందిందని వైద్య సిబ్బంది సైతం దారిలోనే ఉన్నారని తెలుసుకున్నారు. ఇదెలా సాధ్యమైంది అంటే అమ్మ కిందపడిపోయిన తర్వాత ఆమె చేతికున్న యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌లోని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ అప్రమత్తం అయింది. ఆమె శరీరంలో చలనం లేదని తెలుసుకొని అత్యవసర సేవల విభాగం నంబర్‌ 911కు సమాచారం పంపింది. అయితే హోటల్‌ రూంకు వచ్చిన సిబ్బంది ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.’ అని వివరించారు.

తాను ఇలాంటి కథనాలు ఇంతకు ముందు కూడా చాలా చదివేనని చెప్పారు. కానీ అవన్నీ పబ్లిసిటీ కోసం సృష్టించిన వార్తలని అనుకున్నట్లు వివరించారు. అవన్నీ తప్పుడు ఆలోచనలని ఇప్పుడు తెలుసుకున్నట్లు తెలిపారు. యాపిల్‌ టెక్నాలజీ తమ కుటుంబాన్ని కాపాడిందని రెడ్డిట్ వేదికగా ఆమె అభినందించారు.

ఏంటి ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్..

యాపిల్ స్మార్ట్ వాచ్ లో ఫాల్ డిటెక్షన్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా అనుకోని సమయంలో మీరు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం కదలకుండా ఉంటే ఆ స్థితిని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ గ్రహిస్తుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది. మరో 30 సెకన్ల కౌంట్ డౌన్‌ పెడుతుంది. ఆ సమయంలో పెద్ద సౌండ్‌తో అలల్ట్‌ చేస్తుంది. ఆ సమయంలో కిందపడిన వ్యక్తి గానీ లేదా సమీపంలో ఉన్న మరెవరు అయినా ఆ శబ్దం విని అక్కడకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మీరు లేచి స్మార్ట్‌వాచ్‌ పైనున్న టాప్ బటన్‌ క్లిక్‌ చేసి సౌండ్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. ఆ 30 సెకన్లపాటు బటన్‌ను ఆపకపోతే.. ఆటోమేటిక్‌గా మీరు అప్పటికే ఇచ్చిన అత్యవసర నంబర్లు సహా సాధారణ అత్యవసర నంబర్లకు కాల్‌ వెళ్తుంది.

ఇలా యాక్టివేట్ చేసుకోవాలి..

  • ఐఫోన్‌లో వాచ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, మై వాచ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ పై క్లిక్‌ చేయాలి.
  • ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను ఆన్‌ చేయాలి. ఒకవేళ అప్పటికే ఆన్‌లో ఉంటే, ఆల్‌వేజ్‌ ఆన్‌ లేదా ఓన్లీ ఆన్‌ వర్కౌట్స్‌ను ఎంచుకోండి.
  • అయితే అ‌న్ని యాపిల్‌ వాచ్‌ల్లో ఈ ఫీచర్‌ పని చేయదు. యాపిల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. యాపిల్‌ వాచ్‌ ఎస్ఈ, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 4 లేదా ఆ తర్వాత వెర్షన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది.

 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..