IPhone: ఆపిల్ నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌! లీకైన ఫీచర్లు.. ధర ఎంతంటే?

ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఫోల్డ్ పై పనిచేస్తోందని లీక్‌లు సూచిస్తున్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ, ఈ పరికరం 12GB RAM, 1TB వరకు స్టోరేజ్, డ్యూయల్ AMOLED డిస్‌ప్లేలు (5.5", 7.8" ) కలిగి ఉంటుందని అంచనా.

IPhone: ఆపిల్ నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌! లీకైన ఫీచర్లు.. ధర ఎంతంటే?
Apple Foldable Iphone

Updated on: Mar 14, 2026 | 4:40 AM

ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి పని చేస్తున్నట్లు సమాచారం. లీకులు, పుకార్ల ప్రకారం ఈ కొత్త ఫోన్‌ను ఐఫోన్ ఫోల్డ్ పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పరికరం గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ఈ సంవత్సరం విడుదల కావచ్చని పుకార్లు ఉన్నప్పటికీ కచ్చితమైన టైమ్‌లైన్ వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం ఇది ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో కలిసి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో సాధారణ ఐఫోన్ 18 మోడల్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రత్యేక లాంచ్ పొందవచ్చని కూడా టెక్ వర్గాలు చెబుతున్నాయి.

కొరియా టెక్ వెబ్‌సైట్ ది బెల్ నివేదిక ప్రకారం ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 12GB ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఇది అధిక స్థాయి మల్టీటాస్కింగ్, వేగవంతమైన పనితీరుకు సహాయపడుతుంది. ఇక స్టోరేజ్‌ విషయానికి వస్తే.. స్టోరేజ్ ఎంపికలు మూడు రకాలుగా ఉండవచ్చని సమాచారం. 256GB, 512GB, 1TB. ఈ ఫీచర్లు ఫోన్‌ను అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో నిలబెడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

లీక్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉండవచ్చు. ఒకటి 5.5 అంగుళాల ఔటర్ కవర్ స్క్రీన్, మరొకటి 7.8 అంగుళాల ఫోల్డబుల్ మెయిన్ డిస్‌ప్లే. ఈ రెండు స్క్రీన్‌లు అమోలెడ్ డిస్‌ప్లే టెక్నాలజీతో రావచ్చని సమాచారం. దీంతో మంచి రంగులు, మెరుగైన బ్యాటరీ పనితీరు లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ఫేస్ ఐడి, టచ్ ఐడి రెండు కూడా ఉండవచ్చు. ఫోన్‌లో ఆపిల్ కొత్త ఏ20 ప్రో చిప్ ఉండే అవకాశం ఉంది. ఇది వేగవంతమైన పనితీరు, మెరుగైన ఏఐ సామర్థ్యాలను అందించగలదని భావిస్తున్నారు. అలాగే ఈ ఫోన్ ఐఓఎస్ 27 పై నడుస్తుందని అంచనా వేస్తున్నారు.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. చైనా నుండి వచ్చిన లీక్‌ల ప్రకారం ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు 15,999 యువాన్ (దాదాపు రూ.2.15 లక్షలు) ఉండవచ్చు. ఇక 1TB మోడల్ ధర 17,999 యువాన్ (సుమారు రూ.2.69 లక్షలు) వరకు ఉండొచ్చని అంచనా. మొత్తం మీద ఆపిల్ రూపొందిస్తున్న ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రీమియం ఫీచర్లతో పాటు అధిక ధరతో మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశముందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us