బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?

అంటార్కిటికాలోని ఎరెబస్ అగ్నిపర్వతం భూమిపై అత్యంత దక్షిణాన ఉన్నది. ఇది శాశ్వత లావా సరస్సును కలిగి ఉండటమే కాకుండా, ప్రతిరోజూ 80 గ్రాముల సూక్ష్మ బంగారు స్ఫటికాలను విడుదల చేస్తుంది. ఈ బంగారు కణాలు దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి మంచుపై స్థిరపడతాయి.

బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?
Antarctic Volcano Unveils D

Updated on: Jun 30, 2026 | 6:37 PM

ప్రపంచంలో ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నప్పటికీ, అంటార్కిటికాలోని ఎరెబస్ పర్వతం వాటన్నింటికీ భిన్నంగా నిలుస్తోంది. భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న ఈ అగ్నిపర్వతం శాశ్వత లావా సరస్సుతో పాటు, ప్రతిరోజూ సూక్ష్మ బంగారు స్ఫటికాలను వాతావరణంలోకి విడుదల చేసే అరుదైన అగ్నిపర్వతంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. 1991లో జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఎరెబస్ పర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల సూక్ష్మ బంగారు స్ఫటికాలను విడుదల చేస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ బంగారం ధరల ప్రకారం వాటి విలువ రోజుకు సుమారు 6,000 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.5.66 లక్షలు), ఏడాదికి 20 లక్షల డాలర్లకు (సుమారు రూ.18.9 కోట్లు) పైగా ఉంటుందని అంచనా.

భౌగోళిక దక్షిణ ధ్రువానికి సుమారు 1,350 కిలోమీటర్ల దూరంలో రాస్ సముద్రంలోని రాస్ ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి నిరంతరం అగ్నిపర్వత వాయువులు వెలువడుతుంటాయి. ఈ వాయువుల్లో స్వచ్ఛమైన బంగారం సూక్ష్మ కణాలు కలిసి బయటకు వస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. గాలిలో ప్రయాణించే ఈ బంగారు కణాలు దాదాపు 1,000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి, అనంతరం అంటార్కిటికా మంచుపై స్థిరపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో పరిశీలించినప్పుడు ఇవి సాధారణ ధూళి కణాలు కాదని, చక్కటి ఆకారంలో ఏర్పడిన బంగారు స్ఫటికాలని తేలింది. కొన్ని స్ఫటికాల వ్యాసం 60 మైక్రోమీటర్ల వరకు ఉండటం విశేషం.

అగ్నిపర్వత వాయువుల్లో బంగారం కనిపించడం పూర్తిగా కొత్త విషయం కాదు. హవాయిలోని కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలాస్కాలోని అగస్టీన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ వంటి అగ్నిపర్వతాల్లో కూడా స్వల్ప పరిమాణంలో బంగారం గుర్తించారు. అయితే ఎరెబస్ పర్వతంలో కనిపిస్తున్న స్థాయిలో బంగారు స్ఫటికాల విడుదల మాత్రం ప్రత్యేకమైనదిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బంగారం క్లోరిన్ లేదా సల్ఫర్ సమ్మేళనాలతో కలిసి వేడి అగ్నిపర్వత వాయువుల ద్వారా పైకి చేరి, వాయువులు చల్లబడిన తర్వాత స్ఫటికాలుగా మారుతుందని ఒక సిద్ధాంతం చెబుతోంది. మరో సిద్ధాంతం ప్రకారం, ముందుగా లావా సరస్సు ఉపరితలంపై ఈ స్ఫటికాలు ఏర్పడి, అనంతరం వాయువులతో కలిసి గాలిలోకి ఎగిరిపోతాయి. అయితే ఈ రెండు సిద్ధాంతాల్లో ఏది నిజమో ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, ఎరెబస్ పర్వతం సూక్ష్మ బంగారు స్ఫటికాలను ఎలా ఉత్పత్తి చేసి విడుదల చేస్తుందనే ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు. దీంతో ఈ అగ్నిపర్వతం భూగర్భ శాస్త్రంలో ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన రహస్యంగా మిగిలిపోయింది.

Follow Us