
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఐటీ ఉద్యోగుల్లో ఒకింత ఆశలు, అవకాశాలు తెరుస్తూ.. మరోవైపు కలవరపాటుకు గురిచేస్తోంది. కొత్త ఉద్యోగులు, నూతన టెక్నాలజీ, పని భారం తగ్గడం, వేగంగా పనులు జరిగే అడ్వాంటేజెస్ ఉండటంతో ఉద్యోగుల్లో ఏఐ ఆశలు నింపుతోంది. అలాగే ఏఐ ఎక్కడ తమను రీప్లేస్ చేస్తుందో అనే ఆందోళన కూడా వారిలో ఉంది. ఇలా భిన్న కోణాలు ఉన్నా ఉన్నప్పటికీ ఏఐ ఒక సంచలనం. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం టెక్ సంస్థల్లో దాదాపు 40 శాతం పనులు ఏఐ నిర్వహిస్తున్నట్లు పరిశ్రమ సంఘం నాస్కామ్, ఇండీడ్ సంయుక్తంగా నిర్వహించిన ‘వర్క్ రీ-ఇమాజిన్డ్- ది రైస్ ఆఫ్ హ్యూమన్-ఏఐ కొలాబరేషన్’ సర్వే తెలిపింది.
2027 నాటికి మానవ నిపుణులు, ఏఐ కలిసి పనిచేసే వాతావరణాన్ని 97 శాతం మంది హెచ్‌ఆర్‌లు అంచనా వేస్తున్నారు. ఆటోమేషన్ పెరుగుతున్నా, నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఏఐ ఒకప్పుడు బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలకే పరిమితం అయ్యేది. ఇప్పుడు టెక్ సంస్థల్లో ఒక సహోద్యోగిగా మారిపోయింది అని నివేదిక పేర్కొంది. వివిధ విభాగాల్లో 20-40 శాతం పనులను ఏఐ నిర్వహిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఏఐని కేవలం సహాయం చేసేదిగా కాకుండా, రోజువారీ నిర్ణయాల్లో భాగంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐతో కలిసి పనిచేసేలా ఉద్యోగులను సిద్ధం చేయడమే ప్రత్యామ్నాయమని నాస్కామ్ రిసెర్చ్ హెడ్ తెలిపారు.
ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్నప్పుటికీ, ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగంకంటే ఎక్కువ మంది ఏఐ రూపొందించిన పనుల్లో అసంపూర్ణత లేదా తక్కువ నాణ్యత ఉన్నట్లు గుర్తించారు. ఏఐ చేసే పనుల్లో కచ్చితత్వం, సమగ్రత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని నివేదిక తేల్చింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 45 శాతం పనులు ఏఐ ద్వారా జరుగుతుండగా, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి