కూలర్ మోటర్ కాలిపోతే రిపేర్ చేయించాలా? కొత్తది కొనాలా? ఏది మంచిదంటే?
వేసవిలో ఎయిర్ కూలర్ మోటార్ సమస్యలు సాధారణం; పాత మోటార్లు వేడెక్కడం, కాలిపోవడం, శబ్దం చేయడం వంటివి కనిపిస్తాయి. చాలా మంది మోటార్ రిపేర్ చేయించాలా లేక కొత్తది కొనాలా అనే సందిగ్ధంలో ఉంటారు. చిన్న వైరింగ్ సమస్యలు లేదా కాయిలింగ్ కాలిపోతే తక్కువ ఖర్చుతో రిపేర్ చేయవచ్చు.

వేసవి కాలంలో ఎయిర్ కూలర్లు ఎక్కువగా ఉపయోగించడంతో మోటర్ సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత కూలర్లలో మోటర్ వేడెక్కి కాలిపోవడం, శబ్దం చేయడం లేదా తిరగకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వినియోగదారులు కొత్త మోటర్ కొనాలా? లేక పాతదాన్ని రిపేర్ చేయించాలా? అనే సందిగ్ధంలో పడుతున్నారు. అయితే ఇది మోటర్ పరిస్థితి, కూలర్ కొత్తదా? పాతదా? మరమ్మత్తు ఖర్చుపై ఆధారపడి ఉంటుందని.
సాధారణంగా కూలర్ మోటర్‌లో కాయిలింగ్ కాలిపోతే దాన్ని రీవైండింగ్ ద్వారా బాగు చేయవచ్చు. స్థానిక టెక్నీషియన్లు మోటర్ సామర్థ్యాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,500 మధ్య రిపేర్ చేస్తుంటారు. చిన్న సమస్యలు, వైరింగ్ లోపాలు లేదా బేరింగ్ సమస్యలు ఉంటే మరమ్మత్తు చేయించడం తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. ముఖ్యంగా కూలర్ కొత్తదైతే రిపేర్ చేయించడం మంచిదని టెక్నీషియన్లు సూచిస్తున్నారు. అయితే మోటర్ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు లేదా పదే పదే సమస్యలు వస్తున్నప్పుడు కొత్త మోటర్ కొనడం ఉత్తమ ఎంపికగా భావిస్తున్నారు. మార్కెట్లో సాధారణ ఎయిర్ కూలర్ మోటర్లు రూ.1,500 నుంచి రూ.4,000 వరకు లభిస్తున్నాయి. బ్రాండెడ్ మోటర్లు ఎక్కువ కాలం పనిచేయడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పాత మోటర్‌ను పదేపదే రిపేర్ చేయించడం వల్ల భవిష్యత్తులో మరింత ఖర్చు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం విద్యుత్ భద్రత. కాలిపోయిన మోటర్‌ను నాణ్యతలేని విధంగా రిపేర్ చేస్తే షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ ప్రమాదాల ముప్పు ఉండొచ్చు. అందువల్ల అనుభవం ఉన్న టెక్నీషియన్ చేత మాత్రమే మరమ్మత్తులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా చిన్న సమస్యలైతే రిపేర్ చేయించడం ఖర్చు పరంగా మంచిదే. కానీ మోటర్ పాతది, తరచూ పాడవుతుంటే కొత్త మోటర్ కొనడం దీర్ఘకాలంలో లాభదాయకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
