Whatsapp: డేంజర్‌లో వాట్సాప్ యూజర్లు.. ఆ ఫొటోలను ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియనివారు బహుశా ఎవ్వరూ ఉండరు. స్మార్ట్ ఫోన్ వినియోగించేవారందరికి ఇది సుపరిచితమే. ఒకరకంగా చెప్పాలంటే వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు.. ఇలా అన్నింటిని ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వెళతాయి. వాట్సాప్ యాజమాన్యం కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక అప్ డేట్లు చేస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది.

Whatsapp: డేంజర్‌లో వాట్సాప్ యూజర్లు.. ఆ ఫొటోలను ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ..!
Whats App

Updated on: Apr 17, 2025 | 3:45 PM

ఇటీవల వాట్సాప్ యూజర్లకు కేరళ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్ నంబర్ కు కొందరు హాకర్లు ఫొటోలను పంపిస్తున్నారని, వాటిని ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాధారణంగా మన వాట్సాప్ నంబర్ కు నిత్యం అనేక ఫొటోలు, వీడియోలు వస్తూ ఉంటాయి. తెలిసినవారితో పాటు అన్ లోన్ నంబర్ల నుంచి కూడా వస్తాయి. మనం మామూలుగా వాటిని ఓపెన్ చేసి చూస్తాం. అయితే వాట్సాప్ లో వచ్చిన ఫొటోను తెరవడం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. తెలియని నంబర్ల నుంచి ఫొటోలు, వీడియోలు వస్తే ఓపెన్ చేయకూడదని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఫోటో స్కామ్ పై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కేరళ పోలీసులు కోరారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడే విధానాన్ని వివరించారు. ఆ ప్రకారం.. కొందరు స్కామర్లు మన వాట్సాప్ కు చిత్రాలను పంపుతారు. అది ఏమిటా అనే కుతూహలంతో మనం దాన్ని ఓపెన్ చేస్తాం. తీరా చూస్తే అది సాధారణ చిత్రమే అయి ఉంటుంది. కానీ దాని వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ బ్యాంకు వివరాలు, పాస్ వర్డులు, ఓటీపీలు, యూపీఐ సమాచారాన్ని దొంగిలించే, లేకపోతే మీ ఫోన్ ను నియంత్రణ చేసే మాల్వేర్ కావచ్చు. దీనిలో స్టెగానోగ్రఫీ అనే టెక్నిక్ ను స్కామర్లు ఉపయోగిస్తారు. ఫొటో తెరిచిన వెంటనే మీ పరికరాన్ని వారు నియంత్రణలోకి తెచ్చుకుంటారు. దీనివల్ల ఓటీపీలు కూడా రాకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

వాట్సాప్ యూజర్లు ఈ తరహా స్కామ్ లో చిక్కుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియని నంబర్ల నుంచి వచ్చిన చిత్రాలు, వీడియోలను ఎప్పుడూ డౌన్ లోడ్ చేసుకోవద్దు. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయకండి. ముఖ్యంగా మీ వాట్సాప్ సెట్టింగ్ లో ఆటో డౌన్ లోడ్ ఆప్షన్ ను వెంటనే ఆపేయండి. ఫోన్ సాఫ్ట్ వేర్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్ ను సురక్షితంగా ఉంచడానికి అప్ డేట్ చేయాలి. ఒక వేళ మీరు ఏదైనా ఆన్ లైన్ మోసానికి గురైతే 1930 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా పనులను చాల సులభంగా చేసుకునే వీలు కల్పించింది. డబ్బులను పంపాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్నా, పాలసీల ప్రీమియం కట్టాలన్నా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి చిటికెలో పని చేసుకోవచ్చు. ఇదే సమయంలో కొందరు అక్రమార్కులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. వీటిపై అప్రమత్తంగా లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి