AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రికార్డ్‌కు అడుగు దూరంలో ఇస్రో.. 100వ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్..!

2025లోనూ అస్సల్‌ తగ్గేదేలే అంటోంది భారతీ అంతరక్షి పరిశోధనా సంస్థ(ఇస్రో). కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ క్రమంలో మరో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 జనవరి 29న 100వ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

మరో రికార్డ్‌కు అడుగు దూరంలో ఇస్రో.. 100వ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్..!
100th Launch Of Isro
Ch Murali
| Edited By: |

Updated on: Jan 25, 2025 | 5:06 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. స్వదేశీ క్రయోజెనిక్ దశతో కూడిన 100 వ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2025వ సంవత్సరం మొట్ట మొదటి కీలక రాకెట్ GSLV-F15 NVS-02 మిషన్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. GSLV-F15 భారతదేశ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) 17వ రాకెట్ అని, పూర్తి స్వదేశీ క్రయో స్టేజ్‌తో కూడిన 11వ విమానమని ఇస్రో తెలిపింది.

అందులో భాగంగానే ఇస్రో 2025 సంవత్సరంలో మొట్టమొదటి ప్రయోగం జిఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ప్రయోగం ఇస్రోకు 100వ ప్రయోగం కావడం ఓ విశేషం. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియా ట్రాన్స్‌మిషన్ ఆర్బిట్ (GTO) ఆర్బిట్ లోకి విజయవంతం గా పంపేందుకు శ్రీహరికోటలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భారత్ అంతరిక్ష ప్రయోగాల కోసం తొలుత అమెరికా, రష్యా దేశాలపై ఆధారపడి అక్కడ తయారుచేసిన ఉపగ్రహాలను 1960 – 1970 మధ్య కర్ణాటకలోని తుంబ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు. ఆ తర్వాత 1979లో శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలను మొదలుపెట్టిన తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్దుకుని 1980లో ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో ఆ తర్వాత వెనక్కు చూడలేదు. ఒక్కొక్క అడుగు విజయం సాధిస్తూ నేడు ప్రపంచ దేశాలు ఔరా అనిపించేలా కీలక ప్రయోగాలను చేపడుతోంది. స్వదేశీ అవసరాల కోసం అవసరమైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇతర దేశాలపై ఆధారపడ్డ ఇస్రో, నేడు ఎన్నో దేశాల అవసరాలను తీర్చడంలో అందరిని ఆకర్షిస్తోంది. త్వరలోనే మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో.. తాజాగా మరో రికార్డుకు అడుగు దూరంలో ఉంది. కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది.

తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పడినప్పటి నుండి ఇస్రో ఎన్నో రాకెట్ ప్రయోగాలకు వేదిక కావడం విశేషం. ఇస్రో శాస్త్రవేత్తలు జనవరి 29వ తారీఖున ఉదయం 6 గంటల 23 నిమిషాలకు శ్రీహరికోట నుండి ప్రయోగిస్తున్న జిఎస్ఎల్వి ఎఫ్15 రాకెట్ ప్రయోగం 100వది. దీంతో ఇస్రో మరో మైలు రాయిని దాటడం భారత దేశానికి ఒక గర్వ కారణం కావడంతో ఇస్రోలో సంబరాలకు ఆరోజు వేదిక కాబోతోంది.

2025 జనవరి 29వ తారీఖున ఉదయం 6గంటల 23 నిమిషాలకు GSLV. ఎఫ్15 రాకెట్ ప్రయోగం ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన దాల్చిన NVS..02 (ఎన్ వి ఎస్ జీరో టు) అనే ఉపగ్రహాన్ని 36,000 వేల కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న నిర్దేశిత కక్ష GTO అర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు షార్ కేంద్రంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపిన అనంతరం, కక్షలో తిరుగుతూ భారతదేశ నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా ఆర్మీ రంగానికి, సైనిక, నావికా దళాల కార్యకలాపాలకు, వ్యూహాత్మక అనువర్తనాలను ఛేదించడంలోనూ సహాయపడనుంది.

అలాగే, భూగోళ నావిగేషన్‌ను మెరుగుపరచడంలోనూ, సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తున్న సమయంలో ఎక్కువ మత్స్య సంపద ఉన్న ప్రాతాలను గుర్తించి వేటకు వెళ్లేందుకు ముందస్తు సమాచారం అందించనుంది. ఈ ఎన్‌వీఎస్-జీరోటూ ఉపగ్రహం ఉపయోగపడనుంది. దీని బరువు 2,250 కేజీలు. సుమారు10 ఏళ్ల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుందని ఇస్రో అధికారులు తెలిపారు.

ఇస్రో 2024 డిసెంబర్ 30 న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి60 రాకెట్ ప్రయోగం ద్వారా 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో, 2025 జనవరి 29వ తారీఖున 100వ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగం విజయంతో ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుని రికార్డ్ సాదించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జియోసింక్రోనస్ శాటిలైట్ తరహాలో ఇది ఎనిమిదవ రాకెట్ ప్రయోగం కావడం విశేషం. అయితే జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ పరంపరలో ఈ ప్రయోగం 17వది కాగా.. GSLV F15 రాకెట్ ప్రయోగం ఇస్రోకు ఈ ప్రయోగంతో 100వ ప్రయోగం కానుంది. దీంతో ఇస్రో మరో మైలురాయిని దాటనుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..