Yashasvi Jaiswal: ఓవల్ టెస్ట్‌లో ఫ్లయింగ్ కిస్.. ఎవరికి ఇచ్చాడో సీక్రెట్ చెప్పిన యశస్వి జైస్వాల్

ఓవల్ టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్, తన సెలబ్రేషన్స్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. మైదానంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, గుండె గుర్తు చూపించిన సెలబ్రేషన్ తన తల్లిదండ్రుల కోసమేనని చెప్పాడు. తొలిసారిగా తన ఆటను చూడటానికి స్టేడియానికి వచ్చిన తల్లిదండ్రుల కోసం ఇది చేశానని, ఇది తనకు చాలా భావోద్వేగ క్షణమని జైస్వాల్ వివరించాడు.

Yashasvi Jaiswal: ఓవల్ టెస్ట్‌లో ఫ్లయింగ్ కిస్.. ఎవరికి ఇచ్చాడో సీక్రెట్ చెప్పిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal

Updated on: Aug 03, 2025 | 5:01 PM

Yashasvi Jaiswal: ప్రస్తుతం ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి, భారత జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచాడు. సెంచరీ తర్వాత జైస్వాల్ చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అతను ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, లవ్ సైన్ చూపించిన విధానం చూసిన వాళ్లకు తన లవర్ కు ఇలా ఇచ్చాడని అంతా అనుకున్నారు. కానీ ఆ సెలబ్రేషన్ ఎవరి కోసమో దీనిపై జైస్వాల్ క్లారిటీ ఇచ్చాడు.

జైస్వాల్ సెంచరీ సెలబ్రేషన్స్‌పై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే, బీసీసీఐ షేర్ చేసిన ఒక వీడియోలో జైస్వాల్ ఈ సెలబ్రేషన్స్ తన తల్లిదండ్రుల కోసమే అని స్పష్టం చేశాడు. “ఈ సెలబ్రేషన్స్ నా తల్లిదండ్రుల కోసం. నా కుటుంబం మొదటిసారిగా నేను భారత్ తరఫున ఆడుతుంటే చూసేందుకు స్టేడియానికి వచ్చింది. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. వారి ముందు ఇంత మంచి ప్రదర్శన చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని జైస్వాల్ తెలిపాడు.

ఓవల్ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టం అనిపించినా, రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టు 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో, ఆకాష్ దీప్‌తో కలిసి జైస్వాల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. తన టెస్ట్ కెరీర్‌లో ఐదవ సెంచరీ నమోదు చేసిన జైస్వాల్, ఈ సిరీస్‌లో ఇది రెండవ సెంచరీ. అతను 164 బంతుల్లో 2 సిక్సర్లు, 14 ఫోర్ల సహాయంతో 118 పరుగులు సాధించాడు. ఐదవ టెస్ట్ మ్యాచ్ నాలుగవ రోజుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌కు గెలవడానికి 324 పరుగులు అవసరం, భారత్‌కు 8 వికెట్లు కావాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ గెలిచి సిరీస్‌ను 2-2తో డ్రా చేయాలని భారత్ చూస్తోంది.

 

మరిన్ని  క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..