టీ20 ప్రపంచ కప్ జరుగుతోంది. ప్రపంచ మేటి క్రికెట్ జట్లన్నీ ఈ మెగా టోర్నీపైనే దృష్టిపెట్టాయి. సూపర్-12 మ్యాచ్ లు కూడా ప్రారంభమయ్యాయి. సూపర్-12 మొదటి మ్యాచ్ లోనే అతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారీ తేడాతో ఓడిపోయింది కంగారు జట్టు. టీ20 వరల్డ్ కప్ వేళ.. 2023 ఆసియా కప్ పై చర్చ కూడా సాగుతోంది. వాస్తవానికి 2023లో ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. అయితే ఆసియా కప్ 2023 టోర్నీ కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించదని.. తటస్థ వేదికలపైనే ఆడతామని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. అలా చేస్తే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనబోమని ప్రకటించింది. ఈ విషయమై తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ప్రస్తుతం తమ దృష్టంతా టీ20 ప్రపంచకప్ టోర్నీపైనే అని.. భవిష్యత్తు టోర్నీల గురించి బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
టీ20 ప్రపంచకప్ లో భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టబోతోంది. అక్టోబర్ 23వ తేదీ ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ లో ఆసియా కప్ పై మీడియా అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి టీ20 ప్రపంచకప్ టోర్నీ తమకు చాలా ముఖ్యమైనదని అన్నారు. తమ దృష్టంతా ఈ మెగా టోర్నీ పైనే ఉందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నదానిపై మేం ఇప్పుడు ఆందోళనపడట్లేదన్నారు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ప్రస్తుతం లేదన్నారు. ఆసియా కప్ పాకిస్తాన్ లో జరిగితే వెళ్లాలా లేదా అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ గురించే తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ లో ఆడే తుది జట్టుపైనా పూర్తి స్పష్టతతో ఉన్నామని, ప్రతి మ్యాచ్‌కు మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆటగాళ్లందరూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని రోహిత్ శర్మ చెప్పారు.
ఐసీసీ టోర్నమెంట్లలో మంచి ప్రదర్శన చేయలేకపోతున్నామని, గత 9 ఏళ్లుగా ఒక్క ట్రోఫీ సాధించలేకపోయామని, తమ జట్టుకు ఇదొక సవాల్ అని అన్నారు. తమ జట్టుపై ఎన్నో అంచనాలు ఉంటాయని, పెద్ద టోర్నీల్లో ఇలా జరగడం కాస్త అసంతృప్తిగానే ఉందన్నారు. అవకాశాలు తప్పకుండా వస్తాయని, గతాన్ని మార్చేందుకు ఈ టోర్నీ రూపంలో తమకో అవకాశం లభించిందన్నారు. టీ20 ప్రపంచకప్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామనే నమ్మకంతో ఉన్నామన్ఆనరు. ఇలాంటి సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో ఆటగాళ్లకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఫలితం గురించి ఆందోళన చెందకుండా ఉత్తమంగా ఆడటంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నామని రోహిత్ శర్మ తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..