Tokyo Olympics First COVID-19 case: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి మరో వారం రోజులే సమయం ఉంది. ఈ క్రమంలో కరోనా అలజడి సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో మొట్టమొదటి కోవిడ్-19 కేసు నమోదైంది. టోక్యోలోని అథ్లెట్ల గ్రామంలో ఓ అథ్లెట్‌కు జరిపిన పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. దీంతో వేలాది మంది అథ్లెట్లు ఉన్న ఈ క్రీడా నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. గోప్యత దృష్ట్యా కరోనా సోకిన అథ్లెట్ పేరు, ఏ దేశానికి చెందిన వారనేది వెల్లడించడం లేదని టోక్యో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ సీఈవో తోషిరో ముటో పేర్కొన్నారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో కరోనా కేసు వెలుగుచూడటంతో క్రీడకారులు భయాందోళన చెందుతున్నారు. టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడలను కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ప్రేక్షకులు లేకుండా కఠినతరమైన నిర్బంధం, నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూ క్రీడలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాగా.. కరోనా సోకిన అథ్లెట్‌ను ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా వెల్లడించారు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో తొలి కేసు వెలుగులోకి వచ్చిందని టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా తెలిపారు.
Also Read: