Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ కోర్టులో పీవీ సింధు వరుసగా మూడో మ్యాచ్ గెలిచింది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్స్ టికెట్ దక్కించుకుంది. ప్రీ-క్వార్టర్ మ్యాచ్‌లో పీవీ సింధు డెన్మార్క్ ప్లేయర్ మియాపై వరుస సెట్లలో విజయం సాధించింది. 21-15, 21-13తో వరుస సెట్లను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు కేవలం 40 నిమిషాలలో ముగించింది. క్వార్టర్ ఫైనల్లో సింధు క్వార్టర్ ఫైనల్‌లో జపాన్
షట్లర్ యమగుచితో తలపడనుంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది వరుసగా నాలుగోసారి.
పీవీ సింధు కెరీర్‌లో డెన్మార్క్‌కు చెందిన మియాతో ఆరవసారి తలపడింది. ఈ 6 మ్యాచ్‌ల తర్వాత తన ఆధిపత్యాన్ని 5-1కి పెంచుకుంది. వీరిద్దరి మధ్య చివరి మ్యాచ్ 2021 స్విస్ ఓపెన్‌లో జరిగింది. అక్కడ సింధు 22-20, 21-10తో డానిష్ షట్లర్‌ను ఓడించింది. సింధు ప్రపంచ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం 7 వ స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్‌కు షట్లర్ మియా 12 వ స్థానంలో ఉంది.
వరుస సెట్లతో..
సింధు.. డెన్మార్క్ షట్లర్ మియాపై మ్యాచ్ గెలవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. తొలినుంచి సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. డానిష్ షట్లర్ బలహీనతలను పూర్తిగా ఉపయోగించున్న సింధు.. ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. మియాతో జరిగిన తొలి గేమ్‌ను సింధు 21-15 తేడాతో గెలిచింది. రెండు సెట్లను కేవలం 40 నిమిషాల్లో ముగించి, తదుపరి రౌండ్‌కు చేరుకుంది. రియో ఒలింపిక్స్ రజత పతకం గెలిచిన పీవీ సింధు.. టోక్యోలోనూ తన సత్తాను చాటుతున్నారు. గ్రూప్ జె రెండవ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయోంగా న్గాన్‌ను వరుస సెట్లలో (21-9, 21-16) ఓడించింది. ఈ మ్యాచ్‌లో సింధు గెలవడానికి 35 నిమిషాలు పట్టింది. తొలి మ్యాచ్‌లో 21-7, 21-10తో ఇజ్రాయెల్‌కు చెందిన పోలికార్పోవా క్సేనియాను ఓడించింది. మూడవ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరింది.