AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : ఐసీసీ వర్సెస్ బంగ్లాదేశ్..100 మందికి పైగా జర్నలిస్టులపై వేటు..వరల్డ్ కప్ వేళ కొత్త రచ్చ

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే ఐసీసీ చుట్టూ వివాదాల ముసురు అలుముకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

T20 World Cup 2026 : ఐసీసీ వర్సెస్ బంగ్లాదేశ్..100 మందికి పైగా జర్నలిస్టులపై వేటు..వరల్డ్ కప్ వేళ కొత్త రచ్చ
Bangladeshi Journalists Accreditation
Rakesh
|

Updated on: Jan 27, 2026 | 11:37 AM

Share

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే ఐసీసీ చుట్టూ వివాదాల ముసురు అలుముకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 100 మందికి పైగా బంగ్లాదేశ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డుల) దరఖాస్తులను తిరస్కరించడం ఇప్పుడు క్రీడాలకల్లోలంలో కొత్త చిచ్చు రేపింది. బంగ్లాదేశ్ మీడియాను టోర్నీకి దూరం పెట్టడం వెనుక ఐసీసీ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

130 నుంచి 150 దరఖాస్తులు రిజెక్ట్

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ పత్రిక ది డైలీ స్టార్ కథనం ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ 2026 కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులకు ఐసీసీ నిరాశే మిగిల్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మీడియా కమిటీ చైర్మన్ అమ్జాద్ హుస్సేన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తమ దేశం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు అప్లై చేసినా, ఏ ఒక్కరికీ ఐసీసీ నుంచి అనుమతి లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కారణం చెప్పకుండానే సామూహికంగా దరఖాస్తులను తిరస్కరించడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముందు అప్రూవల్.. ఆ తర్వాత క్యాన్సల్

ఈ వివాదంలో మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. కొందరు ఫోటో జర్నలిస్టులకు మొదట ఐసీసీ అనుమతి ఇచ్చింది. మీర్ ఫరీద్ అనే జర్నలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 20న ఐసీసీ మీడియా విభాగం నుంచి అతనికి అప్రూవల్ ఈమెయిల్ తో పాటు వీసా సపోర్ట్ లెటర్ కూడా వచ్చింది. కానీ కొన్ని రోజులకే మరో ఈమెయిల్ పంపి, ఎలాంటి వివరణ ఇవ్వకుండానే అతని అక్రిడిటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి వింత ధోరణి గతంలో ఎప్పుడూ చూడలేదని బంగ్లాదేశ్ జర్నలిజం వర్గాలు మండిపడుతున్నాయి.

సీనియర్ల నిరసన

దాదాపు మూడు దశాబ్దాలుగా క్రికెట్ కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు సైతం ఐసీసీ తీరుపై ధ్వజమెత్తుతున్నారు. 1996 వరల్డ్ కప్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న అరిఫుర్ రెహమాన్ బాబు వంటి వారికి కూడా ఈసారి మొండిచేయి ఎదురైంది. సాధారణంగా టోర్నీలో ఒక దేశం ఆడినా ఆడకపోయినా, ఐసీసీ సభ్య దేశాల జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో జర్నలిస్టుల సంఘాలన్నీ ఏకమై ఐసీసీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి.

ఐసీసీ మౌనం – పెరుగుతున్న ఆందోళన

బంగ్లాదేశ్ జట్టును తొలగించినప్పటి నుంచి ఐసీసీ, బీసీబీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు మీడియాపై కూడా ఆంక్షలు విధించడంతో ఈ వివాదం ముదిరి పాకాన పడింది. అయితే, ఈ ఆరోపణలపై ఐసీసీ మీడియా విభాగం ఇప్పటివరకు నోరు మెదపలేదు. టోర్నీకి సమయం దగ్గర పడుతున్న వేళ, ఈ జర్నలిస్టుల సమస్య పరిష్కారం కాకపోతే వరల్డ్ కప్ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.