పారిస్ పారాలింపిక్స్ 2024 మూడో రోజున షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో రుబీనా ఫ్రాన్సిస్ ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇదే రుబీనాకు పారాలింపిక్ లో తొలి పతకం. అదే సమయంలో పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ కు ఇప్పటి వరకూ మొత్తం 5 పతకాలు దక్కాయి. ఈ పతకాల్లో షూటింగ్‌లోనే 4 పతకాలు వచ్చాయి. రుబీనా 211.1 పాయింట్స్ సాధించి ఈ పతకాన్ని గెలుచుకుంది.
ఫైనల్ స్టేజ్ 1 తర్వాత రుబినా ఫ్రాన్సిస్ మూడో స్థానంలో నిలిచింది. ఈ దశలో ఆమె 10 షాట్‌లలో మొత్తం 97.6 (10.7, 10.3, 10.3, 9.7, 9.0, 8.4, 10.0, 9.8, 9.6, 9.8) స్కోర్ చేసింది. రుబీనా ఫ్రాన్సిస్ తన అద్భుతమైన ఆటను స్టేజ్ 2లో కొనసాగించింది. రుబీనా ఫ్రాన్సిస్‌తో పాటు భారత్‌కు కూడా ఈ పతకం ఎంతో చరిత్రాత్మకం. నిజానికి పారాలింపిక్స్‌లో పిస్టల్ షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన పారా పిస్టల్ షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ ఇటీవలి కాలంలో భారత్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన కనబరుస్తోంది. ఆమె ఇంతకు ముందు కూడా చాలా ఈవెంట్‌లలో భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది, రుబీనా ఫ్రాన్సిస్ వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్స్ వరల్డ్ కప్- 2023లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆమె పారాచూటింగ్ ప్రపంచ కప్‌లో P-6 ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. రుబీనా తల్లి సునీతా ఫ్రాన్సిస్ జబల్‌పూర్‌లోని ప్రసూతి గృహంలో నర్సుగా విధులను నిర్వహిస్తుండగా ఆమె తండ్రి సైమన్ మోటార్ మెకానిక్‌గా పనిచేసున్నారు.
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఖాతాని షూటర్ అవనీ లేఖరా తెరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో అవనీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. కాగా ఈ ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీని తర్వాత ప్రీతీ పాల్ భారత్‌కు మూడో పతకాన్ని అందించింది. 100 మీటర్ల టీ35 విభాగంలో ప్రీతీ పాల్ దేశానికి కాంస్య పతకాన్ని అందించింది. ట్రాక్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి కూడా ప్రీతినే. దీని తర్వాత మనీష్ నర్వాల్ నాలుగో పతకాన్ని సాధించాడు. మనీష్ నర్వాల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1లో రజత పతకం సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..