
ఉత్తరప్రదేశ్‌లో కబడ్డీ క్రీడాకారుడు వీధి కుక్కను రక్షించి, ఆ తర్వాత రాబిస్ వ్యాధితో మరణించిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బులంద్‌షహర్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ ఆటగాడు బ్రిజేష్ సోలంకి కుక్క కాటు కారణంగా మరణించాడు. బ్రిజేష్ ఒక వీధి కుక్కను రక్షించే క్రమంలో అది కరిచింది. కుక్క కాటుకు గురైనప్పటికీ, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రిజేష్ సోలం వృత్తిరీత్యా కబడ్డీ ఆటగాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. దాదాపు ఆరు నెలల క్రితం ఒక వీధి కుక్కను రక్షించే ప్రయత్నంలో అది బ్రిజేష్ సోలంను కరిచింది. అయితే, బ్రిజేష్ సోలం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, ఇంట్లో ఎవరికీ చెప్పలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల బ్రిజేష్ సోలంలో రాబిస్ లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. అనంతరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
బ్రిజేష్ సోలం కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, “మా కుమారుడు ఒక కుక్కను రక్షించే ప్రయత్నంలో కుక్కకాటుకు గురయ్యాడు. ఆ సమయంలో అతను ఈ విషయాన్ని మాకు చెప్పలేదు. ఇటీవల, అతని ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. అతను అన్నం తినడం మానేశాడు, వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మేం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది” అంటూ కన్నీరు మున్నీరయ్యాడు.
ఈ సంఘటన రాబిస్ వ్యాధి పట్ల అవగాహన లోపాన్ని, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కలిగే తీవ్ర పరిణామాలను మరోసారి గుర్తు చేస్తుంది. కుక్కకాటుకు గురైనప్పుడు తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం, రాబిస్ టీకా వేయించుకోవడం ఎంత అవసరమో ఈ సంఘటన తెలియజేస్తుంది. బ్రిజేష్ సోలం మరణం క్రీడా లోకంలో, ముఖ్యంగా అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కాగా, అతని చివరి క్షణాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతను మంచం మీద పడుకుని, నొప్పితో బాధపడుతూ, రేబిస్‌తో బాధపడుతున్నట్లు చూడొచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..