
Allan Nascimento UFC Dead: మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ రంగానికి షాకింగ్ న్యూస్ అందింది. ప్రసిద్ధ యుఎఫ్‌సి ఫైటర్, బ్రెజిల్ స్టార్ అల్లాన్ నాసిమెంటో 34 ఏళ్ల చిన్న వయస్సులోనే హఠాన్మరణం చెందారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించడంతో క్రీడాభిమానులు, సహచర ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అత్యంత ఫిట్‌గా ఉంటూ రింగులో ప్రత్యర్థులను భయపెట్టే యోధుడు ఇలా అకస్మాత్తుగా లోకాన్ని విడిచివెళ్లడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగస్టు 3న సోమవారం ఉదయం బెడ్‌రూమ్‌లో స్పృహతప్పి పడి ఉన్న నాసిమెంటోను గమనించి వెంటనే అత్యవసర వైద్య బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే వచ్చిన వైద్య సిబ్బంది కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిద్రలోనే గుండెపోటు రావడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషాద వార్తను యుఎఫ్‌సి సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది.
ఇదికూడా చదవండి: Video: ఇలాంటి ఔట్ చూశారా.. బద్దకంతో వికెట్ పారేసుకున్న టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?
నాసిమెంటో మృతి పట్ల యుఎఫ్‌సి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ‘మా ప్రియమైన ఫైటర్, అద్భుతమైన ఫ్లైవెయిట్ క్రీడాకారుడు అల్లాన్ నాసిమెంటో ఈ ఉదయం నిద్రలోనే గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచర ఆటగాళ్లకు మా తీవ్ర సానుభూతి తెలియజేస్తున్నాం’ అని యుఎఫ్‌సి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. 34 ఏళ్ల వయసులోనే ఎంతో ఆశాజనకమైన కెరీర్ ఉన్న ఫైటర్ ప్రాణాలు కోల్పోవడం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ రంగానికి తీరని లోటని క్రీడా దిగ్గజాలు నివాళులర్పిస్తున్నారు.
బ్రెజిల్‌కు చెందిన ఈ స్టార్ ఫైటర్ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో అద్భుతమైన ఘనతలు సాధించారు. 2011 లో ప్రొఫెషనల్ కేజ్‌లోకి అడుగుపెట్టిన ఆయన, ప్రారంభంలోనే పది మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. రింగులో ఆయన చూపించే వేగం, ప్రత్యర్థులను లొంగదీసుకునే నైపుణ్యంతో ‘పురో ఓస్సో’ అనే ప్రత్యేక గుర్తింపు పొందారు. మొత్తం 29 పోరాటాల్లో పాల్గొన్న నాసిమెంటో ఏకంగా 22 విజయాలు నమోదు చేసి తన సత్తా చాటారు.
డేనా వైట్ కాంటెండర్ సిరీస్ ద్వారా తన ప్రస్థానాన్ని వేగవంతం చేసిన నాసిమెంటో 2021 లో యుఎఫ్‌సి లోకి అడుగుపెట్టారు. ఆరంభంలో ఓటమి ఎదురైనప్పటికీ, ఆ తర్వాత వరుసగా నాలుగు ఘనవిజయాలు సాధించి ఫ్లైవెయిట్ విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. జేక్ హాడ్లీ, కార్లోస్ హెర్నాండెజ్, కోడీ డర్డెన్ లాంటి ప్రముఖ ఫైటర్లను ఓడించి ప్రత్యేక అవార్డులు కూడా గెలుచుకున్నారు. జూన్ ఇరవైవ తేదీన మిచ్ రాపోసోతో జరిగిన పోరులోనే ఆయన ఆఖరిసారిగా రింగులో కనిపించారు. అంతలోనే ఈ దారుణ వార్త వినాల్సి రావడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..