FIFA World Cup 2026 : పంజాబ్ కనెక్షన్ టు ఆక్లాండ్.. ఫిఫా వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించిన కిరాణా షాప్ ఓనర్ కొడుకు

FIFA World Cup 2026 : పంజాబ్ మూలాలున్న న్యూజిలాండ్ స్టార్ ఫుట్‌బాలర్ సర్ ప్రీత్ సింగ్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఆక్లాండ్‌లోని కిరాణా దుకాణం కుటుంబం నుంచి ప్రపంచకప్ వేదిక వరకు చేరిన అతని ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

FIFA World Cup 2026 : పంజాబ్ కనెక్షన్ టు ఆక్లాండ్.. ఫిఫా వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించిన కిరాణా షాప్ ఓనర్ కొడుకు
Fifa World Cup 2026

Updated on: Jun 16, 2026 | 12:02 PM

FIFA World Cup 2026 : ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు ఆడాలనేది కోట్ల మంది భారతీయుల కల. ఆ కల ప్రస్తుతానికి నెరవేరకపోయినప్పటికీ.. ఫిఫా వరల్డ్ కప్ 2026 వేదికపై ఒక భారతీయ మూలాలున్న ఆటగాడు అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి స్టార్ ఫుట్‌బాలర్ సర్ ప్రీత్ సింగ్ ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇరాన్ జట్టుతో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్ అతడిని నేరుగా స్టార్టింగ్ లైన్-అప్‌లోనే బరిలోకి దించింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఇరాన్, న్యూజిలాండ్ పోరు

ఈ మ్యాచ్‌లో సర్ ప్రీత్ సింగ్ మిడ్‌ఫీల్డర్ పొజిషన్‌లో ఆడుతూ మైదానంలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎంతో చురుగ్గా కదులుతూ.. పూర్తి 90 నిమిషాల పాటు మైదానంలోనే ఉండి జట్టు కోసం వీరోచితంగా పోరాడాడు. అయితే, రెండో హాఫ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎక్స్‌ట్రా టైమ్‌లో న్యూజిలాండ్ కోచ్ మరింత అటాకింగ్ వ్యూహాన్ని అమలు చేయాలని భావించారు. ఇందులో భాగంగానే సర్ ప్రీత్ సింగ్‌ను వెనక్కి పిలిచి, అతని స్థానంలో స్ట్రైకర్ జెస్సీ రాండల్‌ను సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపారు. చివరికి ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది.

గ్రూప్-జిలో మారిన పాయింట్ల సమీకరణాలు

ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రా కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అంతకుముందు ఇదే గ్రూప్-జిలో జరిగిన మరో మ్యాచ్‌లో బలమైన బెల్జియం, ఈజిప్ట్ జట్ల పోరు కూడా 1-1 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. దీనివల్ల ఈ గ్రూపులో ఉన్న నాలుగు జట్లూ ప్రస్తుతం ఒక్కో పాయింట్‌తో సమానంగా నిలిచాయి. దీంతో రాబోయే మ్యాచులు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. అయితే ఈ గ్రూప్ సమీకరణాల కంటే కూడా ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో భారత సంతతి ఆటగాడు సర్ ప్రీత్ సింగ్ సాధించిన ఘనత గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

కిరాణా దుకాణం నుంచి ప్రపంచకప్ వేదిక వరకు

ప్రస్తుతం 27 ఏళ్ల వయసున్న సర్ ప్రీత్ సింగ్ పసిఫిక్ దేశమైన న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో జన్మించాడు. అయితే అతని తల్లిదండ్రులు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. వారు ఆక్లాండ్‌లో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం సాగించేవారు. సర్ ప్రీత్ సింగ్‌కు చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ అంటే విపరీతమైన పిచ్చి ఉండటంతో.. కేవలం 7 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడ వైపు అడుగులు వేశాడు. కొడుకు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కూడా అతనికి పూర్తి సహకారం అందించడంతో జూనియర్ స్థాయిలోనే తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

న్యూజిలాండ్ ఫుట్‌బాల్ హిస్టరీలో నిలిచిపోయే వీరుడు

సర్ ప్రీత్ సింగ్ గతంలో జూనియర్ లెవెల్లో 2017, 2019 లలో జరిగిన అండర్-20 ప్రపంచకప్ టోర్నీలలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటాడు. ఆ తర్వాత అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ కివీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఆడాడు. ఇప్పుడు ఏకంగా మెయిన్ ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడి తన కలని నిజం చేసుకున్నాడు. న్యూజిలాండ్ దేశం తన ఫుట్‌బాల్ చరిత్రలో ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ఇది కేవలం మూడోసారి మాత్రమే (ఇంతకుముందు 1982, 2010 లలో ఆడింది). ఈసారి న్యూజిలాండ్ వరల్డ్ కప్ క్వాలిఫై అవ్వడంలో సర్ ప్రీత్ సింగ్ చేసిన సుదీర్ఘ పోరాటం, అందించిన సహకారం మరువలేనిదని కివీస్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us