
PV Sindhu Fails : ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ తన అభిమానులను నిరాశపరిచింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఓడిపోయి నిష్క్రమించింది. అనవసరంగా ఒత్తిడికి లోనై వరుస ఓటములు చవిచూస్తోంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 17–21, 9–21తో పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో భారత స్టార్ నిరాశపరిచింది.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో తొమ్మిదో సారి పాల్గొన్న పీవీ సింధు సెమీఫైనల్ కొచ్చి వెనుతిరగడం ఇది రెండోసారి. 2018లో కూడా ఆమె సెమీఫైనల్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది. అనవసర తప్పిదాలతో పలుమార్లు ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. ఫలితంగా ఓటమి పాలైంది. స్టార్ ప్లేయర్లు చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా స్టార్ షట్లర్లతోపాటు తెలుగుతేజాన్ని పదేపదే ఓడించే కరోలినా మారిన్ (స్పెయిన్) కూడా ఈ టోర్నీలో పాల్గొనలేదు. అయినా సింధు ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.