Hockey Junior World Cup: ఈ నెలలో జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్‌కు హాకీ ఇండియా జట్టును ఇటీవలే ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సీనియర్ భారత జట్టులో భాగమైన వివేక్ ప్రసాద్‌కు ఈ టోర్నమెంట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వివేక్‌కి ఇది రెండో ప్రపంచకప్. గాయం కారణంగా 2016 సీజన్‌లో జూనియర్ ప్రపంచకప్‌కు దూరమైన భారత ఆటగాడు వివేక్ సాగర్ ప్రసాద్. నవంబర్ 24 నుంచి భువనేశ్వర్‌లో ప్రారంభమయ్యే జూనియర్ ప్రపంచకప్‌లో ప్రస్తుతం జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
2016లో భారత జట్టు జూనియర్ ప్రపంచకప్‌ను గెలుచుకుంది. కానీ, ఆ విజయంలో ప్రసాద్ భాగం కాలేకపోయాడు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో జన్మించిన ప్రసాద్ (16) జూనియర్ ప్రపంచకప్‌లో ఆడిన అతి పిన్న వయస్కులలో ఒకడిగా ఉన్నాడు. కానీ, గాయం కారణంగా ఎంపిక కాలేదు.
కొత్త పాత్రకు సిద్ధం..
టోర్నమెంట్‌లో బెల్జియం, నెదర్లాండ్స్, అర్జెంటీనా, జర్మనీ, కెనడా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, పాకిస్తాన్, కొరియా, మలేషియా, పోలాండ్, ఫ్రాన్స్, చిలీ, స్పెయిన్, యూఏఈ పాల్గొంటున్నాయి. జనవరి 2018లో, అతను సీనియర్ హాకీ జట్టుతో అరంగేట్రం చేశాడు. దీని తర్వాత, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన రెండవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అయితే, ప్రసాద్‌కు ఈ పాత్ర కొత్త కాదు. ఎందుకంటే అతను గతంలోనూ టీమిండయాకు నాయకత్వం వహించాడు. భువనేశ్వర్‌లో తన పాత సహచరులతో కలిసి మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.
సీనియర్ జట్టులో ఉండటం పెద్ద బాధ్యత..
ప్రసాద్ మాట్లాడుతూ.. ‘గతంలో కూడా జూనియర్ టీమ్‌కి నాయకత్వం వహించిన నాకు ఇది కొత్త పాత్ర కాదు. అవును, సీనియర్ జట్టులో భాగంగా, నా పాత్ర కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ జట్టులో ప్రతి ఆటగాడికి భిన్నమైన పాత్ర ఉంటుంది. అది వారికి తెలుసు. నేను సీనియర్ జట్టులోనూ జూనియర్ జట్టులో చేసిన ప్రయోగాలనే చేసి విజయం సాధిస్తామని’ తెలిపాడు.
భారత జట్టు: వివేక్ సాగర్ ప్రసాద్ (కెప్టెన్), సంజయ్, శార్దానంద్ తివారీ, ప్రశాంత్ చౌహాన్, సుదీప్ చిర్మాకో, రాహుల్ కుమార్ రాజ్‌భర్, మణిందర్ సింగ్, పవన్, విష్ణుకాంత్ సింగ్, అంకిత్ పాల్, ఉత్తమ్ సింగ్, సునీల్ జోజో, మంజీత్, రబీచంద్ర సింగ్ మొయిరంగ్థెమ్, అభిషేక్ లక్రా, యశ్దీప్ సివాచ్, గురుముఖ్ సింగ్, అరిజిత్ సింగ్ హుందాల్