FIFA World Cup 2026 : ప్లేయర్ల అకౌంట్లలో అసభ్యకర కామెంట్లు ఆటోమేటిక్‌గా మాయం.. ఫిఫా వరల్డ్ కప్ 2026లో కొత్త టెక్నాలజీ

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఆటగాళ్లను సోషల్ మీడియా ట్రోలింగ్, ద్వేషపూరిత వ్యాఖ్యలు, బెదిరింపుల నుంచి కాపాడేందుకు అధునాతన ఏఐ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అమలు చేయనుంది. అసభ్యకర కామెంట్లను ఆటోమేటిక్‌గా హైడ్ చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోనుంది.

FIFA World Cup 2026 :  ప్లేయర్ల అకౌంట్లలో అసభ్యకర కామెంట్లు ఆటోమేటిక్‌గా మాయం.. ఫిఫా వరల్డ్ కప్ 2026లో కొత్త టెక్నాలజీ
Fifa World Cup 2026

Updated on: Jun 10, 2026 | 3:45 PM

FIFA World Cup 2026 : ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండగ అయిన ఫిఫా వరల్డ్ కప్‎కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నమెంట్ సమయంలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. మ్యాచ్ గెలిచినా, ఓడినా కొందరు ఆకతాయిలు, ట్రోలర్స్ ఆటగాళ్ల అకౌంట్లపై పడి ద్వేషపూరిత వ్యాఖ్యలు, బూతులు, బెదిరింపులకు దిగుతుంటారు. దీనివల్ల ఆటగాళ్లు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ పెద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ప్రపంచకప్ నుంచి ఆటగాళ్లకు పటిష్టమైన డిజిటల్ రక్షణ కల్పించబోతోంది.

రక్షణగా నిలవనున్న అధునాతన ఏఐ టెక్నాలజీ

ఆటగాళ్లను ఆన్‌లైన్ వేధింపుల నుంచి కాపాడటానికి ఫిఫా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా వరల్డ్ కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు, వారి జట్లకు చెందిన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఈ ఏఐ సిస్టమ్ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ, ఆటగాళ్ల పోస్టుల కింద వచ్చే ప్రతి కామెంట్‌ను, మెసేజ్‌ను నిశితంగా పరిశీలిస్తుంది.

ఈ ఏఐ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?

ఈ సరికొత్త వ్యవస్థ పనితీరు చాలా సింపుల్ అండ్ స్మార్ట్‌గా ఉంటుంది. టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్ల, జట్ల సోషల్ మీడియా ఖాతాలను ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేస్తారు. ఎవరైనా సరే ఒక ప్లేయర్ పోస్ట్ కింద అసభ్య పదజాలం ఉపయోగించినా, జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినా, లేదా బెదిరింపులకు దిగినా.. ఈ ఏఐ టెక్నాలజీ ఆ కామెంట్‌ను కేవలం కొన్ని మిల్లీసెకన్లలోనే గుర్తించేస్తుంది. అలా గుర్తించిన వెంటనే ఆ కామెంట్‌ను పబ్లిక్‌కు కనిపించకుండా ఆటోమేటిక్‌గా హైడ్ చేస్తుంది. దీనివల్ల సదరు ఆటగాడికి గానీ, ఇతర అభిమానులకు గానీ ఆ చెడు కామెంట్లు అస్సలు కనిపించవు.

పదే పదే తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

ఈ ఏఐ కేవలం కామెంట్లను దాచిపెట్టడమే కాకుండా, ఒక నిఘా నేత్రంలా పనిచేస్తుంది. ఎవరైనా నెటిజన్ ఒకటికి రెండుసార్లు కావాలనే అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తుంటే.. అలాంటి అకౌంట్లను ఈ సిస్టమ్ ప్రత్యేకంగా ట్రాక్ చేస్తుంది. ఈ సరికొత్త నిబంధనల ప్రకారం.. పరిమితి దాటి ప్రవర్తించే అకౌంట్ల వివరాలను ఫిఫా సేకరిస్తుంది. అవసరమైతే ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల సహాయంతో ఆ అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేయడమే కాకుండా, సైబర్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడదు.

ఈ అధునాతన సాంకేతికత ద్వారా సోషల్ మీడియాలో ఒక ఆరోగ్యకరమైన, సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని ఫిఫా గట్టిగా నమ్ముతోంది. ఆటగాళ్లు ఎలాంటి మానసిక ఆందోళనలు లేకుండా కేవలం తమ ఆటపైనే దృష్టి పెట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మైదానంలో ఆటగాళ్లకు ఎలాగైతే భద్రత ఉంటుందో.. డిజిటల్ ప్రపంచంలో కూడా అలాంటి భద్రతను అందించడం ద్వారా ఫుట్‌బాల్ క్రీడను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లవచ్చని ఫిఫా భావిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us