Annemiek Van Vleuten: సైక్లింగ్ పోటీలు ఎంత మజా ఉంటుందో అంతే ప్రమాదం ఉంటుంది. ఈ పోటీలు చూడడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ.. పోటీలో పాల్గొనే రేసర్లకు మాత్రం అడుగడుగునా ముప్పు పొంచి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలకే ప్రమాదం. ఈనేపథ్యంలో నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా సైక్లిస్ట్, ఒలింపిక్ ఛాంపియన్ అనెమిక్ వాన్ లూటెన్ సైక్లింగ్ రేస్‌లో తీవ్రంగా గాయపడింది. పోటీలో భాగంగా పట్టు తప్పి కింద పడిపోవడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తేలడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని వోల్లోంగాంగ్లోలో నిర్వహిస్తున్న రోడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం మిక్స్‌డ్ టీమ్ ట్రయల్ రెండో రౌండ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన వ్యాన్ లూటెన్ ప్రారంభంలో వేగంగానే ముందుకు సాగింది. అయితే డౌన్‌కు వెళుతున్న సమయంలో సైకిల్‌ను బ్యాలెన్స్ చేయలేక రోడ్డు పక్కనున్న బ్యారియర్‌ను ఢీకొంది. దీంతో సైకిల్‌పై నుంచి కింద పడిపోయిన ల్యూటెన్ చేతులను అడ్డుపెట్టింది. దీంతో ఆమె మోచేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్‌ను చూసి ముందు, వెనకాల ఉన్న రేసర్లు షాక్‌కు గురయ్యారు. అయితే అప్పటికే రేస్ ప్రారంభం కావడంతో ముందుకు సాగారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ది యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ (UCI) తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనెమిక్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే వాన్ లూటెన్.. టోక్యో ఒలింపిక్స్ 2020లో టైమ్ ట్రయల్‌లో స్వర్ణం, రోడ్ రేస్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించింది.
⚠️ CRASH for @AvVleuten!! ⚠️
Mechanical issue causes horrible crash for the Dutch superstar.
Really disappointing day for the Dutch. #Wollongong2022 pic.twitter.com/rU5LYNnlcu— UCI (@UCI_cycling) September 21, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..