
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత్ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జ్యోతి యర్రాజీ అనే పాతికేళ్ల అథ్లెట్ 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం సాధించారు. కేవలం 12.96 సెకన్లలో సరికొత్త ఛాంపియన్‌షిప్ రికార్డును నెలకొల్పారు. అలాగే అవినాష్ సాబుల్ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 36 యేళ్లలో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఈ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు అవినాష్ సాబుల్ కావడం విశేషం. ఈ ఇద్దరు అథ్లెట్లు ఒకే ఏడాది రెండు బంగారు పతకాలు సాధించడం దేశం గర్వించదగ్గ విజయంగా భావించాలి. తాజా విజయం ప్రపంచ అథ్లెటిక్స్ వేదికపై భారత్ ప్రతిష్టను రెట్టింపు చేసింది.
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నకి చెందిన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించిన ఇండియన్ మోస్ట్ పాపులర్ అథ్లెట్. జ్యోతి నిరుపేద కుటుంబానికి చెందిన అథ్లెట్. ఆమె తల్లిదండ్రులు సెక్యూరిటీ గార్డుగా, ఇళ్లల్లో పనివాళ్లుగా పనిచేశారు. వారి కుటుంబ ఆదాయం చాలా తక్కువ. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ జ్యోతి దృఢ సంకల్పం, ప్రతిభను గుర్తించిన ఆమె కోచ్ జ్యోతిని ప్రొఫెషనల్ అథ్లెట్‌గా మార్చారు. ఇప్పుడు ఆమె దేశం గర్వించదగ్గ అథ్లెట్ గా మారి తన ఉనికిని ప్రపంచ వేదికపై చాటింది. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో విజేతగా నిలిచిన జ్యోతి చూట్టూ.. ఎలాంటి హర్ష ద్వానాలు లేవు, ప్రేక్షకులు లేరు.. కనీసం అభినందించేవారు కూడా లేదు. మౌనంగా దేశం కోసం పరుగెత్తి ప్రపంచమంతా వినేలా విజయ ఢంకా మొగించింది. ప్రస్తుతం అథ్లెట్ జ్యోతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.